గత పదేళ్ళ బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలగా ఉంది.అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతోంది.
అయితే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశ తప్పదా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.స్వయంగా సొంత పార్టీనేతలే కాంగ్రెస్ విజయంపై ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో ఆ పార్టీని ఓటమి భయం వెంటాడుతోంది.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం నాలుగింట్లో విజయం సాధించాలని కాంగ్రెస్ మొదట భావించింది.
కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్ ను తిరస్కరిస్తూ ఏకంగా మూడు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు ఆయా రాష్ట్రాల ప్రజలు.
దాంతో హస్తం పార్టీ ఆశలు అడియాశలయ్యాయి.ఆయా రాష్ట్రాల వారీగా పట్టు సాధించాలని భావించిన కాంగ్రెస్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపితే.ఓటమి తప్పదనే భయం కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి విస్తోందని, ఇటీవల జరిగిన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమౌతుందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
అంతే కాకుండా ఈ ఫలితాలు ఇండియా కూటమికి గట్టి హెచ్చరిక అని ఆయన చెప్పడం కొసమెరుపు.దీంతో ఇండియా కూటమి విజయం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు బీజేపీ పక్షాన ఉన్నారనే భావన స్వయంగా కాంగ్రెస్ నేతలే వ్యక్తం చేస్తుండడం గమనార్హం.ఇక మరో మూడు లేదా నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
ఈలోగా రాష్ట్రాల వారీగా లోటుపాట్లను సరిచేసుకుంటూ ఎన్నికల సమయానికి ఇండియా కూటమి పూర్తి బలం ప్రదర్శిస్తే.ఎన్డీయే కూటమికి పోటీనిచ్చే అవకాశం ఉందని లేదంటే కాంగ్రెస్ కు ఈసారి కూడా నిరాశ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.
మరి విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న హస్తం పార్టీ ఎలాంటి వ్యూహరచనతో ముందుకు సాగుతుందో చూడాలి.