కరోనా ప్రభావం, లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టాలను మూటకట్టుకుంటున్నాయి.చాలా థియేటర్ యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక తొలగించేశాయి.
ఆర్థిక భారం వల్ల థియేటర్ల నిర్వహణ కష్టంగా మారిందని, తమను ఆదుకోవాలంటూ చాలా థియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వానికి తన ఆవేదనను మొరపెట్టుకున్నాయి.కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
అయితే ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు థియేటర్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.ఈ క్రమంలో ఐనాక్స్ మూవీస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.కేవలం రూ.2999కే థియేటర్ మొత్తానికి బుక్ చేసుకని నచ్చిన సినిమా చూడవచ్చని ఆఫర్ ప్రకటించింది.ఒక వ్యక్తి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఇలా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకుని నచ్చిన టైంలో సినిమా చూడవచ్చని తెలిపింది.
ఆసక్తి ఉన్న వారు tickets@inoxmovies.comకి మెయిల్ చేయాలని ఐనాక్స్ మూవీస్ యాజమాన్యం స్పష్టం చేసింది.
థియేటర్లలో 50 శాతం సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది.ప్రేక్షకులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని కోరింది.
అయితే ఈ ఆఫర్ ఎన్నిరోజులు ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు.
లాక్‌డౌన్ తర్వాత సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో 50 సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అన్‌లాక్-5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.