భారతీయ ఫార్మా ఇండస్ట్రీకి షాక్... అమెరికాలో ఈ నాలుగు కంపెనీల మందులు రీకాల్

కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో భారతీయ ఫార్మా రంగం ప్రపంచానికి పెద్ద దిక్కుగా మారిన సంగతి తెలిసిందే.

కష్టకాలంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులను వివిధ దేశాలకు సరఫరా చేసి భారత ప్రభుత్వం మానవత్వాన్ని చాటుకుంది.

ఇలాంటి పరిస్ధితుల్లో భారత్‌కు చెందిన నాలుగు ఫార్మా కంపెనీలు తమ ఔషధాలను యూఎస్ నుంచి రీకాల్ చేశాయి.మనదేశానికి చెందిన లుపిన్, మార్క్సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ తమ డ్రగ్స్‌ను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించాయి.

ప్రస్తుతమున్న వస్తువుల తయారీ నిబంధనలను పాటించకపోవడం వల్ల యూఎస్.యూనిట్ లుపిన్ 6,540 బాటిల్స్ మెట్ ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ మాత్రలను ఉపసంహరించుకుంటుందని యూఎస్‌ఎఫ్‌డీఏ నివేదిక పేర్కొంది.

అలాగే మార్క్సన్స్ ఫార్మా 11,279 సీసాల మెట్ ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ మాత్రలను ఉపసంహరించుకుంది.వీటిని మార్క్సన్స్ అమెరికన్ కంపెనీ టైమ్- క్యాప్ ల్యాబ్స్‌కు సరఫరా చేసింది.

Advertisement

ఈ కంపెనీల మెట్ ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ మాత్రలలో ఎన్- నైట్రో‌సోడిమైథైలామైన్ ఆమోదయోగ్యమైన స్థాయిని మించిందని యూఎస్ఎఫ్‌డీఏ పేర్కొంది.ఇక మన తెలుగు ఫార్మా దిగ్గజం హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా యూఎస్ విభాగం 1,440 సీసాల క్లోజాఫైన్ మాత్రలను ఉపసంహరించుకుంటోంది.ఈ డ్రగ్‌ను కొన్ని మానసిక అనారోగ్యాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.100 మి.గ్రా బాటిల్‌లో 50 మి.గ్రా మాత్రలు మాత్రమే దొరికాయని ఒక వినియోగదారుడు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయడం అక్కడ చర్చనీయాంశమైంది.అదేవిధంగా అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ 19,153 బాటిల్స్ అరిపిప్రజోల్ టాబ్లెట్లను ఉపసంహరించుకుంటోంది.

దీనిని స్కిజోఫోనియా, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. డ్రగ్ లేబుల్‌లో కొంత లోపం కారణంగా కంపెనీ వాటిని ఉపసంహరించుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు