అమెరికా రాజకీయాల్లో భారతీయులు దూసుకుపోతున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ సభ్యులుగా , సెనేటర్లుగా ఎన్నికైన ఇండో అమెరికన్లు అక్కడి స్థానిక సంస్థల బరిలోనూ నిలిచారు.
వీరికి ప్రవాస భారతీయ సంఘాలు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి.దీనిలో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ మేయర్ పదవికి డెమొక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మహేశ్ భాగియాను ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ సీనియర్స్ అసోసియేషన్స్ ఆఫ్ నార్త్ అమెరికా చైర్మన్ దీపక్ షా ఎండార్స్ చేశారు.
నవంబర్‌లో జరగనున్న ఈ ఎన్నికల్లో మహేశ్ కనుక గెలిస్తే ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా ఘనత వహించనున్నారు.అయితే ఇదే పదవి కోసం మరో ఐదుగురు భారతీయులు సైతం పోటీలో నిలిచారు.
కరోనా సమయంలో భాగియా తన పెద్ద మనసును చాటుకున్నారు.పెద్ద ఎత్తున ఫుడ్ ప్యాంట్రీలను నిర్వహించడంతో పాటు వృద్ధులు, ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లకు పీపీఈ కిట్‌లను పంపిణీ చేశారు.
డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్ధిని భారీ ఓట్ల తేడాతో ఓడించారు మహేశ్.
ఇక ఒహియాలోని సిన్సినాటి మేయర్ పదవికి పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్ అప్తాబ్ పురేవల్‌కు డెమొక్రాట్ పార్టీ అనుకూల ఏఏపీఐ విక్టరీ ఫండ్ మద్ధతు లభించింది.
అఫ్తాబ్ తండ్రి భారతీయుడు కాగా, తల్లి టిబెటెన్ జాతీయురాలు.ప్రస్తుతం హామిల్టన్ కౌంటీ క్లర్క్ ఆఫ్ కోర్ట్స్‌గా పనిచేస్తున్నారు పురేవల్.ఒహియోలో మూడవ అతిపెద్ద నగరం సిన్సినాటీ .ఇది హామిల్టన్ కౌంటీలో భాగం.సిన్సినాటీ మేయర్ పదవికి తాను పోటీ చేస్తున్నట్లు జనవరిలో అఫ్తాబ్ ప్రకటించారు.ఇప్పటికే నిధుల సమీకరణలోనూ ఆయన దూసుకెళ్తున్నారు.

మరోవైపు చికాగో ప్రాంతంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో దాదాపు పది మంది భారతీయులు పోటీపడుతున్నారు.వీరిలో మాజీ కాంగ్రెస్ అభ్యర్ధి సహా ప్రముఖ వైద్యుడు కూడా వున్నారు.ఇది అమెరికన్ రాజకీయాల్లో భాగం కావాలనే భారతీయ అమెరికన్ సమాజంలో పెరుగుతున్న అభిలాషను ప్రతిబింబిస్తుంది.వీరిలో ఐదుగురు మహిళలు కూడా వున్నారు.ఏప్రిల్ 6న ఎన్నికలు జరగాల్సి వున్నప్పటికీ.ముందస్తు ఓటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
జితేంద్ర దిగాన్వ్కర్ అనే కమ్యూనిటీ నేత మైనే టౌన్‌షిప్ హైవే కమీషనర్ పదవి కోసం పోటీ పడుతున్నారు.చికాగో లూప్‌కు పశ్చిమాన 15 మైళ్ల దూరంలో వున్న ఓక్ బ్రూక్ నగరంలో ట్రస్టీ సీటు కోసం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ రెడ్డి బరిలో నిలిచారు.
షామ్‌బర్గ్ టౌన్‌షిప్ ట్రస్టీగా నిమిష్ జానీ పోటీ పడుతుండగా, సయ్యద్ హుస్సేనీ.హనోవర్ పార్క్ టౌన్‌షిప్ ట్రస్టీగా, మైనే టౌన్‌షిప్ క్లర్క్‌గా స్మితేష్ షా పోటీపడుతున్నారు.కమలా హారీస్ స్పూర్తితో ఐదుగురు భారతీయ మహిళలు సైతం ఎన్నికల బరిలో నిలిచారు.నాపర్‌విల్లే సిటీ కౌన్సిల్‌కు వాసవి చక్కా, వీట్ ల్యాండ్ టౌన్‌షిప్ ట్రస్టీగా మెహగానా బన్సాల్, ఆల్డర్‌మాన్ 10వ వార్డ్‌కు శ్వేతా బెయిర్ అరోరా, సుప్నా జైన్, సబా హైదర్‌లు డిస్ట్రిక్ట్ 204 స్కూల్ బోర్డ్ కోసం పోటీపడుతున్నారు.
—