యూఎస్: కార్డియాలజీలో అసాధారణ సేవలు .. ఇండో - అమెరికన్ డాక్టర్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ పలు రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

వీరిలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, వ్యోమగాములు వున్నారు.

ముఖ్యంగా వైద్య రంగంలో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారు.అక్కడి ప్రఖ్యాత ఆసుపత్రుల్లో సేవ చేస్తూ భారతదేశానికి, ఆశ్రయం ఇచ్చిన గడ్డకు గర్వ కారణంగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇందర్ ఆనంద్‌ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.2021 సంవత్సరానికి గాను హార్ట్ ఫెయిల్యూర్ సొసైటీ ఆఫ్ అమెరికా (హెచ్ఎఫ్‌ఎస్ఏ) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.రక్త ప్రసరణ, గుండె వైఫల్యం, బయోలజీ వంటి రంగాల్లో చేసిన సేవలకు గాను ఇందర్ ఆనంద్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

హెచ్‌ఎఫ్‌ఎస్ఏ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును హెచ్ఎఫ్‌ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బహుకరిస్తుంది.సెప్టెంబర్ 11, 2021న జరిగిన హెచ్ఎఫ్ఎస్ఏ వార్షిక సమావేశంలో ఆయన ఇందర్ ఆనంద్ అవార్డును అందుకున్నారు.

Advertisement

డాక్టర్ ఆనంద్ ఇండియన్ రోడ్స్ స్కాలర్.అమెరికాలోని టాప్ కార్డియాలజిస్టులలో ఆయన కూడా ఒకరు.1966లో ఆయన రోడ్స్ స్కాలర్‌షిప్ అందుకున్నారు.ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కార్డియోవాస్కులర్ ఫిజియాలజీలో డి.ఫిల్ పొందారు.అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి 1976లో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించారు.1990లో అమెరికా వెళ్లడానికి ముందు ఆయన చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో పనిచేశారు .చండీగఢ్ పీజీఐ వ్యవస్థాపక సభ్యులలో ఆయన కూడా ఒకరు.డాక్టర్ ఆనంద్ తండ్రి.డాక్టర్ సంతోఖ్ సింగ్.1991 నుంచి 2015లో పదవీ విరమణ చేసే వరకు మిన్నియాపోలిస్‌లోని వీఏ మెడికల్ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా, హార్ట్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు.భారత్‌లో గుండె వైఫల్యంపై ఇందర్ పరిశోధనలు చేశారు.

దీనిలో భాగంగా ఎక్కువ ఎత్తులో నివసించే వ్యక్తులలో రెండు కొత్త సిండ్రోమ్‌లను కనుగొన్నారు.ఇండో టిబెట్ బోర్డర్‌లో దాదాపు 20,000 అడుగుల ఎత్తులో విధులు నిర్వర్తిస్తున్న భారతీయ సైనికులు ఈ తరహా అనారోగ్యం బారినపడుతున్నట్లు ఇందర్ ఆనంద్ గుర్తించారు.1995లో హెచ్ఎఫ్ఎస్‌ఏ వ్యవస్థాపక సభ్యుడిగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా, కోశాధికారిగా, జర్నల్ ఆఫ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అసోసియేట్ ఎడిటర్, కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఆయన పలు హోదాలలో పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు