వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు.స్వదేశానికి ఎన్నో రకాలుగా లాభాలను చేకూరుస్తున్నారు.
వీరి వల్ల పెద్ద సంఖ్యలో విదేశీ మారక ద్రవ్యం భారతదేశ ఖజానాకు జమ అవుతోంది.దీనికి తోడు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ప్రభుత్వాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
స్వదేశంలో పెట్టుబడులు పెట్టి.ఎంతో మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.
ఈ క్రమంలో విదేశీ మారక ద్రవ్యాన్ని అందుకుంటున్న దేశాల్లో ఈ ఏడాది భారత్ అగ్రస్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంక్( World Bank ) ప్రకటించింది.ఎన్ఆర్ఐల నుంచి భారత్ ఈ ఏడాది పది లక్షల కోట్ల రూపాయలను అందుకుంది.

ఈ ఆర్ధిక సంవత్సరం అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు ప్రవాసుల నుంచి 66,900 కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.55.64 లక్షల కోట్లు) అందినట్లు నివేదిక తెలిపింది.గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అల్ప, మధ్యాదాయ దేశాలు అందుకున్న మొత్తం సగటున 3.8 శాతం పెరిగినట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.ఇవి దక్షిణాసియా దేశాలకు 7.2 శాతం పెరిగాయట.అలా ఈ ప్రాంత దేశాలకు 18,900 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం అందితే.
అందులో ఒక్క భారతదేశానికే 66 శాతం వచ్చినట్లు నివేదిక పేర్కొంది.మనదేశానికి 12,500 కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.10 లక్షల కోట్లు) వచ్చాయట.ఇండియా తర్వాతి స్థానాల్లో మెక్సికో 6,700 కోట్లు, చైనా 5,000 కోట్లు, పాకిస్తాన్ 2,400 కోట్లు, బంగ్లాదేశ్ 2,300 కోట్ల డాలర్లు అందుకున్నాయి.
అమెరికా, బ్రిటన్, సింగపూర్ దేశాల్లో వున్న ఎన్ఆర్ఐలు భారత్‌కు అత్యధిక మొత్తాలు పంపినట్లు నివేదిక చెబుతోంది.కేవలం ఈ మూడు దేశాల నుంచే మనకు 36 శాతం విదేశీ మారక ద్రవ్యం సమకూరింది.
వీటి తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ తదితర గల్ఫ్ దేశాలు వున్నాయి.

మెరుగైన ఉపాధి అవకాశాలు, అధిక వేతనాలు అందుతూ వుండటంతో భారతీయులు పాశ్చాత్య , గల్ఫ్ దేశాల నుంచి స్వదేశానికి పెద్ద మొత్తంలో విదేశీ ద్రవ్యాన్ని పంపగలుగుతున్నారు.2024లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.2024లో ప్రవాస భారతీయులు( Expatriate Indians ) 13,500 కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.11.22 లక్షల కోట్లు) విదేశీ మారక ద్రవ్యాన్ని పంపుతారని అంచనా.అయితే విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపేందుకు ప్రవాసులను అధిక పన్నులు ఇబ్బంది పెడుతున్నట్లు నివేదిక పేర్కొంది.అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు ప్రవాసులు విదేశీ మారక ద్రవ్యాన్ని పంపడం కోసం సంబంధిత బ్యాంకులకు ఎక్కువ ఫీజులు కట్టాల్సి వస్తోంది.
ఇదే సమయంలో దక్షిణాసియా దేశాల్లో చాలా తక్కువ, దీనికి తోడు భారత్ పలు దేశాలతో యూపీఐ విధానం( UPI Transaction )పై ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఎన్ఆర్ఐలకు ప్రయోజనాలు కలిగిస్తోంది.







