ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య( Hardeep Singh Nijjar ) వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా కలకలం రేపుతున్నాయి.ఈ నేపథ్యంలో కెనడాలోని ఖలిస్తాన్ గ్రూపులు, సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నిజ్జర్ హత్య వెనుక భారత్ కుట్ర వుందంటూ ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి.తాజాగా ట్రూడో ప్రకటన దీనికి బలం చేకూర్చినట్లయ్యింది.

ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే కెనడా ప్రధాని వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది.ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.ప్రజలు, వ్యాపారవేత్తలు, ఇతర వర్గాల విజ్ఞప్తుల నేపథ్యంలో భారత్ ఇటీవల తన వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని తిరిగి పునరుద్ధరించింది.
నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ఆరోపణలను తాము తోసిపుచ్చడం లేదని , అలాగే కెనడా దర్యాప్తును కూడా తాము వ్యతిరేకించడం లేదన్నారు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( Jaishankar ).అయితే ఈ వాదనలకు అనుగుణంగా బలమైన సాక్ష్యాలు తమ ముందు పెట్టాలని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం యూకే పర్యటనలో వున్న జైశంకర్ .ప్రముఖ జర్నలిస్ట్ లియోనెల్ బార్బర్‌తో ‘‘ హౌ ఎ బిలియన్ పీపుల్ సీ ది వరల్డ్ ’’ అనే శీర్షికతో జరిగిన సంభాషణ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

తన ఆరోపణలకు మద్ధతు ఇచ్చే ఎలాంటి ఆధారాలను భారత్‌తో కెనడా పంచుకోలేదని జైశంకర్ పేర్కొన్నారు.కెనడాలో ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలను ప్రస్తావిస్తూ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక నిర్దిష్ట బాధ్యతతో వస్తాయన్నారు.ఆ స్వేచ్ఛలను దుర్వినియోగం చేయడం , రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగాన్ని సహించడం చాలా తప్పు అని జైశంకర్ పేర్కొన్నారు.ఈ విషయమై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ( Mélanie Joly )తో సంప్రదింపులు జరుపుతున్నట్లు జైశంకర్ వెల్లడించారు.
కెనడాలోని భారత హైకమీషన్‌పై ఖలిస్తాన్ సానుభూతిపరుల దాడులు, దౌత్యవేత్తలపై స్మోక్ బాంబు దాడులను ఆయన గుర్తుచేసుకున్నారు.ఈ ఘటనలతో భారతీయ దౌత్యవేత్తలు భయభ్రాంతులకు గురయ్యారని, దీనికి కారణమైన వారిపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జైశంకర్ చురకలంటించారు.