తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో టికెట్ల కేటాయింపు వ్యవహారం పెద్ద దుమరాన్ని రేపుతోంది.రెండు విడతలుగా ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబుతాను విడుదల చేశారు.
వంద నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.అయితే టికెట్లు కేటాయింపులో సీనియారిటీ , సిన్సియారిటీని పట్టించుకోలేదని, కొత్తగా వలస వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని అలక చెందడమే కాకుండా, పార్టీ అగ్ర నేతలు తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొంత మంది ఇప్పటికే పార్టీ మారారు.
మరి కొంతమంది పార్టీలోనే ఉంటూ రెబెల్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. చాలా నియోజకవర్గాల్లో ఇదే రకమైన పరిస్థితి ఉండడంతో అసంతృప్తి నేతలను ఏ విధంగా బుద్ధిగించాలనే విషయంపై కాంగ్రెస్ దృష్టి సారించింది.

కొంతమంది గాంధీ భవన్( Gandhi Bhavan ) ముందు ఆందోళనలు చేపట్టడం, పార్టీ అభ్యర్థుల ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండడం తో వీరిని బుజ్జగించే విషయంపై దృష్టి సారించింది .పార్టీ నుంచి వెళ్ళిపోయి ఇతర పార్టీలో చేరిన నేతలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, పార్టీలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి ఓటమికి కృషి చేసే వారి తోనే అసలు ఇబ్బందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటన తర్వాత ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది.గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్( BRS party ) ప్రభుత్వ వేధింపులు తట్టుకుని పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశామని, నియోజక వర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు భారీగా సొమ్ములు ఖర్చు పెట్టామని , కానీ ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికే పెద్దపీట వేస్తూ పార్టీ కోసం కష్టపడిన తమను పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే తాము సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక చేపట్టామని, సర్వేల్లో ఎవరు గెలుస్తారనే దానిని ఆధారంగా చేసుకుని టికెట్ల కేటాయింపు చేపట్టామని, టిక్కెట్లు దక్కని వారు అసంతృప్తికి గురవకుండా రెబల్ గా పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన పదవులు ఇచ్చి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది.