మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ వ్యవహారంపై వివాదం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే విధంగా కనిపించడం లేదు.ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్న రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరిపోవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది.
ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాను అనే విషయాన్ని ప్రకటించడం తో మునుగోడులో ఉప ఎన్నికలు రాబోతున్నాయనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.ఇది ఇలా ఉంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరుతుండడం పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు.
తల్లి లాంటి సోనియాగాంధీకి వెన్ను పోటు పొడిచి పార్టీని వీడుతున్నాడని , కాంట్రాక్టుల కోసమే బిజెపిలో చేరుతున్నాడని, పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో వెళ్ళిపోతున్నాడని , ఇంకా అనేక విమర్శలు రేవంత్ రెడ్డి చేశారు.
దీనిపై తాజాగా రాజగోపాల్ రెడ్డి మీడియా ముందు ఘాటుగా విమర్శలు చేశారు.
తాను పార్టీకి ఏమీ అన్యాయం చేయలేదని, రేవంత్ రెడ్డి వెనుక టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారని, నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి తన గురించి ఎలా మాట్లాడుతాడని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.ఎటువంటి వ్యాపారం లేకుండా వందల కోట్లు రేవంత్ రెడ్డి ఎలా సంపాదించారని ? కాంట్రాక్టులు తీసుకుని బిజెపిలో జాయిన్ అవుతున్నానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని , నిరూపించకపోతే పిసిసి పదవికి రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు .

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ది కాదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.తనపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నారని , సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారని విమర్శించారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల కోసమే రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఈ తరహా సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయాల్లో మరింత కాక రేగుతోంది.