గత కొంతకాలంగా విమానాల్లో రచ్చ జరిగిన ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.ఎయిరిండియా విమానానికి సంబంధించిన ఒక తాజా ఉదంతంలో తాగిన మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడు 70 ఏళ్ల మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలు వినిపించాయి.
ఈ సంఘటన నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో చోటుచేసుకుంది.అంతకుముందు బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వస్తున్న విమానంలో జరిగిన ఒక ఫైట్ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఇందులో నలుగురైదుగురు ఒక వ్యక్తిపై దాడి చేశారు.దీనికి కొన్ని రోజుల ముందు ఇండిగో విమానంలో ప్రయాణికుడు, అటెండర్ మధ్య వాగ్వాదం జరగగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
విమాన ప్రయాణాల్లో ఈ విధమైన అభ్యంతరకర ప్రవర్తనకు సంబంధించిన కేసులు తరచూ తెరపైకి వస్తున్నాయి.
అయితే సురక్షితమైన విమాన ప్రయాణం కోసం కొన్ని నియమాలు రూపొందించారు.
వీటి ప్రకారం అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.ఇంతేకాదు అలాంటి ప్రవర్తన కలిగిన ప్రయాణీకులను నో ఫ్లై లిస్ట్‌లో కూడా చేర్చవచ్చునో ఫ్లై లిస్ట్ నియమం అంటే ఏమిటి?సెప్టెంబరు 2017లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ప్రయాణంలో ప్రవర్తనలపై వచ్చే ఫిర్యాదును పరిష్కరించడానికి కొన్ని నియమాలను విడుదల చేసింది.వీటి ప్రకారం విమాన ప్రయాణంలో అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికుల జాబితాను సిద్ధం చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు.ఈ చట్టాలు అన్ని భారతీయ విమానయాన సంస్థలకు కూడా వర్తిస్తాయి.
ఇందులో టోక్యో ఒప్పందం 1963 నిబంధనల ప్రకారం చూస్తే చెడుగా ప్రవర్తించే ప్రయాణికులతో వ్యవహరించడానికి అవసరమైన పలు మార్పులు చేశారు.కొత్త నిబంధనల ప్రకారం చెడు ప్రవర్తన కలిగిన ప్రయాణీకులను నోఫ్లై జాబితా కింద మూడు వర్గాలుగా విభజించారు.
మొదటి వర్గం
ఎవరైనా ప్రయాణీకుడు తన మాటలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే, అతన్ని మొదటి వర్గంలో ఉంచుతారు.ఇందులో బెదిరింపు, అభ్యంతరకరమైన ప్రవర్తన, మాటలతో వేధించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటివి ఉంటాయి.
ఈ వర్గంకింద ఎవరైనా ప్రయాణికుడు దోషిగా తేలితే అతని విమాన ప్రయాణాలపై 3 నెలల పాటు నిషేధం విధించవచ్చు.అంటే ఆ ప్రయాణికుడు 3 నెలల పాటు విమానాలలో ప్రయాణించలేడు.

రెండవ వర్గం
రెండవ వర్గంలో శారీరక అసభ్యతను జత చేర్చారు.దీనిలో నెట్టడం, తన్నడం, పట్టుకోవడం, లైంగిక వేధింపులు లేదా అనుచితంగా తాకడం వంటివి ఉన్నాయి.ఎవరైనా ప్రయాణీకుడు ఈ రెండవ కేటగిరీ కిందకు వస్తే అప్పుడు ఆ వ్యక్తి విమాన ప్రయాణాలను 6 నెలల పాటు నిషేధిస్తారు.
మూడవ వర్గం
మూడవ కేటగిరీలో సహ ప్రయాణికుడు లేదా సిబ్బందికి ప్రాణహాని ఏర్పడినటువంటి కేసులను చేర్చారు.
దీని ప్రకారం ఎవరైనా ప్రయాణికుడు దోషిగా తేలితే అతని విమాన ప్రయాణాలను రెండు సంవత్సరాల పాటు నిషేధిస్తారు.ఘటన తీవ్రమైనదయితే సంబంధిత ప్రయాణీకుడికి జీవితాంతం విమాన ప్రయాణాన్ని నిలిపివేసే అవకాశం ఉంది.







