ఆంధ్రా ఉద్యోగుల తరలింపులో ప్రతిబంధకంగా మారిన స్థానికత అంశంపై ఏర్పడ్డ పీటముడి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్రతో వీడిపోయినట్టే కనిపిస్తున్నా… ఈ విషయంలో ఉద్యోగులు తరలి వెల్లడానికి మరింత తాత్సారం చేసే ఆస్కారం ఉన్నట్టుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.చెట్ల క్రింద కూర్చోనయినా పనిచేసి, ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పిన ఉద్యోగులు తీరా తరలింపు ప్రస్తావన వచ్చినప్పుడల్లా స్ధానికత తెరపైకి తేవటం గత రెండేళ్లుగా జరుగుతుండటంతో ప్రజలలోనూ కొంత గందరగోళం ఏర్పడిన మాట వాస్తవం.
ఈ విషయంలో కేంద్రానికి పంపిన బిల్లుకు అమోదం తెలపవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్ధనని సైతం తోసిరాజిల్లి రాజముద్ర పడటంతో రాష్ట్ర ప్రభుత్వ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.ఏపీ ఉద్యోగుల స్థానికత వర్తింపునకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయటంతో మూడేళ్ల పాటు అంటే 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 2 వరకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే ఉద్యోగుల పిల్లలు, సామాన్య ప్రజలకు స్థానికత వర్తించే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించింది.2017 జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారి పిల్లలకు వారు కోరుకున్న జిల్లాలో స్థానికత కల్పించేలా మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసుకునే అవకాశాలు దక్కాయి.
ఇన్నాళ్లూ స్ధానికతను, తమ పిల్లల చదువులను తెరపైకి తెచ్చిన ఉద్యోగులను గత ఏడాది కాలంగా ఈ విద్యాసంవత్సరం నాటికి తరలింపు జరిగేలా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తునే ఉంది.
కానీ ఇప్పుడు వసతుల లేమిని తెర పైకి తెచ్చి తరలింపును అడ్డుకోవాలని కొందరు చేస్తున్న యత్నాలపై నేరుగా ముఖ్యమంత్రే హెచ్చరికలు చేయాల్సిన పరిస్ధితి.
ఈ క్రమంలో మరి కొంత కాలం తరలి రావటానికి సమయం కావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్న సందర్భంలో పరాయి రాష్ట్రంలో ఉండి పాలన చేయడం పట్ల ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తిని అర్ధం చేసుకోరెందుకని, తరలిరావటానికి అభ్యంతరాలు ముఖ్యమంత్రినయిన తనతో కాకుండా పురందరేశ్వరి లాంటి ఇతర నేతలతో చర్చిస్తే ఫలితమేముంటదని చంద్రబాబు నేతలపై మండి పడ్డరు.
రాష్ట్రపతి ఉత్తర్వుల నేపధ్యంలో రాజధాని కార్యాలయాల తరలింపులో స్పీడు పెంచాలని, ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేయటంతో సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోనూ, వివిధ కమిషనరేట్ కార్యాలయాలను తరలించేందుకు, ఉద్యోగుల ఖాళీలు, నియామకాలు తదితర అంశాలపై రూట్ మ్యాప్ సిద్ధం కావటంతో ఇక తరలింపే తరువాయి అనేలా ఉంది పరిస్థితి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని వివిధ శాఖల్లో సుమారు 240 మంది వరకు 4వ తరగతికి చెందిన తెలంగాణ ఉద్యోగులు ఏపికి వెళ్లేందుకు నిరాకరిస్తూ నిరసనలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
తెలంగాణా వారిని వెనక్కి తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గతంలో చేసిన ప్రకటించిన కార్యరూపం దాల్చక పోవటంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో ఎంత మందిని తెలంగాణకు పంపిస్తే, అంతే సంఖ్యలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కు పంపించే లా గతంలో సర్దుబాటుకు ఒప్పందం కుదుర్చుకున్నా అవి తమకెందుకు వర్తించవని నినదిస్తున్నారు.
కాగా అమరావతి నుంచి ఈ నెల 27 నుంచి పాలన ప్రారంభమైనా ఏర్పడే ఒడిదుడుకులను గుర్తించి సరిదిద్దేందుకు ప్రభుత్వం కొందరు అధికారులను ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం.
రాజధాని కార్యాలయాలలో, తరలి వచ్చిన ఉద్యోగులకు స్ధానికంగా వసతులు ఇతర సమస్యల విషయమై తగిన చర్యలు తీసుకుని పరిష్కారదిశగా ఈ అధికారులు తగిన ఏర్పాటు చేస్తారని వినవస్తోంది.
తరలింపు పూర్తయిన తదుపరి రాజధాని కార్యాలయాల విషయాన్ని ప్రజలకు తెలిపేలా సూచికలను ఏర్పాటు చేసే ప్రయత్నాలను రహదారుల భవనా శాఖ చేపడుతోంది.
ఏది ఏమైనా సొంత రాజధాని నుంచి పరిపాలన జరగనుందన్న కథనాలు జన సామాన్యంలోనూ ఏదో తెలియని ఆనందాన్ని నింపుతోంది.