ఏపీలో మూడు రాజధాని అంశం మరోసారి తెరపైకి రాబోతోంది.ఏపీకి ఒకటే రాజధాని ఉండాలని ,అది అమరావతి మాత్రమే కావాలని టిడిపి తో పాటు విపక్ష పార్టీలన్నీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
అమరావతి ప్రాంత రైతులు, దీనిపై ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు.అయినా ఏపీ అధికార పార్టీ వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులను చేసి తీరుతామని , అమరావతి ,విశాఖ, కర్నూలు లో రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించడమే కాకుండా , దానికి సంబంధించిన కసరత్తు చేస్తుంది.
ఇప్పటివరకు న్యాయపరమైన వివాదాలు తలెత్తడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.అయితే ముందు ముందు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా వైసిపి ప్లాన్ చేస్తోంది.

దీనిలో భాగంగానే వచ్చే నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి.ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.మూడు రాజధానుల బిల్లులు గతంలో సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం తిరిగి వాటిని వెనక్కి తీసుకుంది.న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉండడంతోనే ఈ చర్యలకు దిగింది.అయితే ఇప్పుడు ప్రవేశ పెట్టబోయే బిల్లును జాగ్రత్తగా రూపొందిస్తుంది.ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ,కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించింది.ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతుంది.

ఇంకా ఏడాది మాత్రమే ఉంది.ఈ లోపుగా తాము మూడు రాజధానులను ఏర్పాటు చేయకపోతే, ప్రజలలో చులకన అవుతామని, ప్రతిపక్షాలు పై చేయి సాధించినట్లు అవుతుందని అధికార పార్టీ వైసిపి భావిస్తోంది.అందుకే జగన్ సైతం ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నారు.వీలైనంత తొందరగా మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు.







