వాట్సాప్ లో గ్రూపు క్రియేట్ చేయడం గురించి అందరికి తెలిసిందే.ఒకే మెసేజ్ ను ఒకేసారి అందరికి పంపే విధంగా ఎక్కువ మందిని ఒక గ్రూప్ గా క్రియేట్ చేస్తారు.
అయితే ఇలా గ్రూప్ క్రియేట్ చేసే వారిని గ్రూప్ అడ్మిన్ అని అంటారు.అయితే గ్రూప్ లో కేవలం అడ్మిన్ మాత్రమే మెసేజ్ లు చేయడు.
గ్రూప్ లో ఉన్నవారు అందరు కూడా మెసేజెస్ చేయవచ్చు.కానీ గ్రూప్ లో ఎవరినన్నా యాడ్ చేయాలన్నాగాని, డిలీట్ చేయాలన్నాగాని అది కేవలం అడ్మిన్ చేతిలో మాత్రమే ఉంటుంది.
ఈ క్రమంలోనే వాట్సాప్ గ్రూప్ లోని మెంబర్స్ షేర్ చేసే వివాదాస్పద, విద్వేషపూరిత పోస్టులకు గ్రూప్ అడ్మిన్లు బాధ్యులు కాదని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తాజాగా తీర్పును వెలువరించింది.గతంలో ఒక లాయర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
అసలు వివరాల్లోకి వెళ్తే.తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ సిటీకి చెందిన రాజేంద్రన్ అనే లాయర్ ‘కరూర్ లాయర్స్’ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు.
ఈ గ్రూపుకు రాజేంద్రన్ అడ్మిన్ గా వ్యవహరిస్తున్నారు.అయితే అందులో ఉన్న ఒక మెంబర్ కాంట్రవర్షియల్ పోస్టును షేర్ చేయగా అది కాస్త కొన్ని వర్గాల మధ్య అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించేలా మారింది.
దాంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు అయింది.దీనిలో రాజేంద్రన్ పేరును కూడా పోలీసులు చేర్చి కేసు నమోదు చేసారు.
అయితే ఈ వివాదాస్పద పోస్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం తాను గ్రూప్ అడ్మిన్ గా మాత్రమే ఉన్నానని, ఈ కేసు నుంచి తనను తొలగించాలని రాజేంద్రన్ కోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై తాజాగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తీర్పు నిచ్చారు.
గ్రూప్ సభ్యులు చేసిన నేరంతో అడ్మిన్‌కు ఎలాంటి సంబంధం లేనట్లయితే ఆ అడ్మిన్ ని నిందితుల జాబితా నుంచి తప్పనిసరిగా తొలగించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

కానీ ఫిర్యాదుదారు ప్రకారం అడ్మిన్ రాజేంద్రన్ అబద్ధాలు చెబుతున్నాడని, ఇతనికి గ్రూప్ మెంబర్ కి మధ్య ఏదో సీక్రెట్ ప్లాన్ ఉండి ఉంటుందని ఫిర్యాదుదారు ఆరోపించారు.మొదట రాజేంద్రన్ తన గ్రూపు మెంబర్ ని గ్రూప్ నుంచి తొలగించి తరువాత మళ్లీ యాడ్ చేశారని వివరించారు.ఈ ఆరోపణలను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.
అయితే వాట్సాప్ గ్రూప్ లో జరిగిన కాన్వర్జేషన్ కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది.ఒకవేళ ఈ కేసులో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ రాజేంద్రన్ పాత్ర లేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలితే అతన్ని ఛార్జిషీట్ నుంచి తొలగించాలని జస్టిస్ జీఆర్ స్వామినాథన్ పేర్కొన్నారు.
అలాకాకుండా ఇందులో అతని పాత్ర కూడా ఉన్నట్లు తెలిస్తే మాత్రం అతను కూడా నిందితుడని స్పష్టం చేశారు.