తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి అన్నట్లుగా నాయకుల వలసలు కొనసాగుతున్నాయి.
ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లోకి జోరుగా చేరికలు చోటు చేసుకున్నాయి.
మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ లు, ఇతర పదవుల్లో ఉన్న కీలక నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ ఉండగా , ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వలసలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం చాలా కాలం నుంచి వస్తున్నా, కొద్దిరోజుల క్రితం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. దీంతో ఆయన బిజెపిలో చేరడం దాదాపు ఖాయమైపోయిందని అంత అనుకుంటుండగా, రాజగోపాల్ రెడ్డి సైతం అదే రకమైన సంకేతాలను ఇచ్చారు.అయితే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరాల్సిందిగా అమిత్ షా కండిషన్ విధించడంతో ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి సందిగ్ధం లో ఉన్నారు.
ఇది ఎలా ఉంటే ఈ వ్యవహారం రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇబ్బందికరంగా మారింది.మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగానే ఉంటూ వస్తున్న వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు.
కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ వెంకటరెడ్డి కొంతకాలం పాటు అసంతృప్తికి గురైనా, ఆయనకు స్టార్ క్యాంపైనర్ హోదా ఇచ్చి సరైన సమయంలో మరింత ప్రాధాన్యం ఇస్తామని అధిష్టానం పెద్దలు బుద్ధిగించడంతో ఆయన పార్టీలో యాక్టివ్ గానే పని చేస్తున్నారు.

అయితే రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలు కారణంగా అప్పుడప్పుడు అసంతృప్తి కి గురై విమర్శలు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు సోదరుడు రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరితే వెంకటరెడ్డి ప్రాధాన్యం కాంగ్రెస్ లో తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సొంత సోదరుడు పార్టీ మారకుండా వెంకటరెడ్డి చూసుకోలేకపోయారని ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేయడంతో పాటు, అధిష్టానం పెద్దలు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉంటారనే ఆందోళన వెంకటరెడ్డిలో బలంగా కనిపిస్తోంది.అంతేకాదు స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని బిజెపిలో చేరుస్తున్నారనే ప్రచారం కూడా మొదలైతే , తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు ఏర్పడతాయనే ఆందోళనలో వెంకటరెడ్డి ఉన్నారట.
ఇక రాజగోపాల్ రెడ్డి సైతం బిజెపిలో చేరేందుకు ఎటువంటి అడ్డంకులు లేకపోయినా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లే విషయంలోనే ఆయన కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.మొత్తానికి కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం ఇరకాటంలో పడినట్టుగానే కనిపిస్తోంది.







