టాయిలెట్ నిర్మాణం కోసం గుంత తవ్వుతుండగా బంగారు నాణేలు లభ్యమయ్యాయి.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో జరిగింది.
నాణేలు బ్రిటీష్ కాలం నాటివి కావడంతో స్థానికులు క్యూ కట్టారు.ఇంతకీ ఏం జరిగిందంటే.
ఇమామ్ అలీ రైనీ భార్య అయిన నూర్ జహాన్ తన ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించాలని కూలీలను పిలిచింది.కూలీలు వచ్చి గుంత తవ్వుతుండగా అక్కడ వారికి ఓ రాగి పాత్ర లభించింది.
దానిని తెరిచి చూస్తే బ్రిటీస్ కాలం నాణేలు ఉన్నాయి.
అవి బంగారు నాణేలు కావడంతో వాటి కోసం కూలీలు వాగ్వాదానికి దిగారు.
నూర్ జహాన్ కుటుంబీకులు ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా చూశారు.అయితే మరుసటి రోజు కూడా కూలీలు వచ్చి తవ్వి చూడగా వారికి మరికొన్ని బంగారు నాణేలు కనిపించాయి.
ఈ క్రమంలో తమకు కూడా ఒక బంగారు నాణెం ఇవ్వాలని కూలీలు పట్టుపట్టడంతో యజమాని వారికొక నాణెం ఇచ్చాడు.

బంగారు నాణేల విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి పోలీసులకు తెలిసింది.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాణేలను స్వాధీనం చేసుకున్నారు.బంగారు నాణేలు 1889-1920 కాలం నాటివని పోలీసులు గుర్తించారు.
కూలీలను పోలీసులు విచారించారు.అయితే పోలీసుల వస్తున్నారన్న సంగతి తెలిసిన మరికొందరు కూలీలు పరారీలో ఉన్నారు.
సంఘటనా స్థలంలో ఉన్న మరికొందరు కూలీలను ఆరా తీయగా వారి వద్ద నుంచి పది బంగారు నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రతి కూలీని పోలీసులు విడిగా విచారించారు.
పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మచ్లీషహర్ అధికారి అతర్ సింగ్ వెల్లడించారు.ఇంటి ఆవరణలో తవ్వకాలు జరిపితే మరింత సంపద బయటపడే అవకాశం ఉందని పై అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.







