సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరిని హడలెత్తిస్తున్న అంశం కరోనా.ఎప్పుడు ఎవరికి,ఎలా ఈ కరోనా సోకుతుందో అన్న విషయం ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.
గత ఆరు నెలలుగా దేశంలో ఏర్పడ్డ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు సైతం వరుసగా కరోనా బారిన పడుతున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
అలానే మధ్యప్రదేశ సీఎం చౌహన్,కర్ణాటక సీఎం,హర్యానా సీఎం ఇలా పలువురు కరోనా బారినపడగా,తాజాగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తుంది.ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అయితే ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని కావున వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్ లో ఉంటున్నట్లు ఆయన వెల్లడించారు.ఇంటి నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తానని తెలిపిన ఆయన ఇటీవల తనను కలిసిన వారంతా కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకొని,కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.