సమర్ధవంతమైన పోలీస్ అధికారిగా, నిజాయితీపరుడిగా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి నుంచి జగన్ కేసుల వరకు లక్ష్మి నారాయణ సీబీఐ అధికారిగా తనదైన స్టయిల్లో పనిచేసుకుంటూ ముందుకు వెళ్లారు.
ఆ తరువాత ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడం, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చక చక జరిగిపోయాయి.కాకపోతే ఆయన సొంతంగా పార్టీ స్థాపిస్తారని అంతా అనుకున్నారు.
దానికి తగ్గట్టే ఆయన కూడా ఏపీలో అనేక ప్రాంతాల్లో తిరుగుతూ జనాల్లో పలుకుబడి పెంచుకున్నారు.ఆ తరువాత తరువాత టీడీపీ, బీజేపీ పార్టీల్లో చేరుతారనే ప్రచారం గట్టిగా సాగినా జనసేనలో ఆయన చేరడం విశాఖ ఎంపీగా పోటీ చేయడం అక్కడ ఓడిపోవడం జరిగింది.
విశాఖ బరిలో పోటీకి దిగిన జేడీ లక్ష్మీనారాయణ సమయాభావం వల్ల ఎక్కువ ప్రచారం చేయలేకపోయారు.కొన్ని ప్రాంతాల్లో ఆయన ముఖం కూడా చూపించలేదు.అయినా ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, నిజాయతీపరుడు అన్న భావం ప్రజల్లో ఉండడంతో ఆయన ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు.ఏకంగా రెండు లక్షల 80 వేల పై చిలుకు ఓట్లను ఆయన సాధించగలిగారు.
ముందు నుంచి క్రమ పద్ధతిలో ప్రచారం చేసి ఉంటే ఆయన గెలిచేవారన్న అభిప్రాయం పార్టీలో కూడా వ్యక్తం అయ్యింది.ఆయన ఓటమి చెందినా ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గకపోవడంతో ప్రధాన పార్టీలు కొన్ని జేడీని తమ పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

జేడీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యామ్న్యాయం కోసం చూస్తున్నారు.జనసేనలో ఉండడం వల్ల ప్రయోజనం ఉండదని, పొలిటికల్ కెరియర్ ముగిసిపోతుందని అనే భావం ఆయనలో ఎక్కువ కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీలో చేరితే అన్ని విధాలుగా తన ఎదుగుదలకు ఉపయోగంగా ఉంటుందని లక్ష్మి నారాయణ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇదే సమయంలో బీజేపీ కూడా రాయలసీమతో పాటు, ఏపీ మొత్తం పరిచయం ఉన్న నాయకుడు, ముఖ్యంగా కాపు సామాజికవర్గం నేత, యువతను ఆకట్టుకునే డైనమిక్ లీడర్ గా పేరున్న జేడీ కనుక పార్టీలోకి వస్తే ఏపీలో బాగా పుంజుకోవచ్చని చూస్తోంది.
మరికొద్ది రోజుల్లో జేడీ బహిరంగంగా తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.







