భారత దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో ప్రతి సంవత్సరం జరిగే రామ్‌లీలా ఉత్సవాలు ఈసారి నిర్వహించడం లేదు.కరోనా మహమ్మారి కారణంగా వేడుకల నిర్వహణకు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని లవ్ కుశ్ రామ్ లీలా కమిటీ వెల్లడించింది.
గత 80 సంవత్సరాలుగా ప్రతి ఏడాది దసరా రోజున ఈ మైదానంలో రామ్‌లీలా వేడుకలు నిర్వహిస్తుండగా, ఈసారి మాత్రం వేడుకల్లేకుండా మైదానం ఖాళీగా ఉండబోతుంది.ఇక్కడ జరిగే రామ్ లీలా వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి పాల్గొనడం ఆనవాయితీ.
కాగా, రామ్‌లీలా, దుర్గాపూజ ఉత్సవాలను మాత్రం నిర్వహించుకోవచ్చని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.అయితే, వీటిలోనూ కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరని స్పష్టం చేసింది.
నిజానికి తాము ఉత్సవాలను నిర్వహించాలనే అనుకున్నామని అయితే, ఎర్రకోట మైదానం ఏఎస్ ఐ పరిధిలోకి వస్తుండడంతో తమకు ఇప్పటి వరకు అనుమతి లభించలేదని లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ తెలిపింది.వేడుకల నిర్వహణకు చాలా సమయమే ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
80 ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలు ఈసారి మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.మతపరమైన ఏ సంఘటన అయినా అది మహమ్మారి వ్యాప్తికి కారణం కాకూడదన్నదే తమ అభిమతమని వివరించింది.
ఏ చిన్న అవకాశం లభించినా కూడా ఒక రోజు వేడుకను నిర్వహిస్తామని కమిటీ స్పష్టం చేసింది.







