జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యారు.2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ఇక ఆ పార్టీ తోనే కలిసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని, బలం పెంచుకుని 2024 ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని భావించారు.అయితే బీజేపీ వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేసే విషయంలో మొహమాటం పడుతున్నట్లుగా వ్యవహరిస్తూ, జనసేన ను కూడా రాజకీయంగా యాక్టివ్ అవ్వకుండా కట్టడి చేస్తూ వస్తోంది.అయితే ఇటీవల గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తో కాస్త ఇబ్బందులు ఏర్పడినా, పవన్ రైతులకు భరోసా కల్పించే నిమిత్తం జిల్లాల యాత్ర చేపట్టారు.
నివర్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.కృష్ణాజిల్లా లో పవన్ పర్యటించారు.అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేశాయి.
పవన్ పర్యటన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి , మాజీ ఎంపీ రెడ్డయ్య వెళ్లి కలవడం, ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.
రైతుల విషయమై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు డొల్ల అంటూ రెడ్డయ్య వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.ఇవే కాకుండా, ఏపీ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేయడం, పవన్ తో కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం వంటి వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి.
రెడ్డయ్య కుమారుడు పార్థసారథి ఎమ్మెల్యే గా ఉన్నారు.జగన్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి గా ఆయనకు పేరు ఉంది.అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.మధ్యలో మంత్రివర్గ ప్రక్షాళన చేసినా, పార్థసారథి కి అవకాశం దక్కుతుందని అంతా అంచనా వేశారు.
అయినా, జగన్ పార్ధసారధి వైపు మొగ్గు చూపలేదు.

ఈనేపథ్యంలో జగన్ పై అసంతృప్తిగానే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న సమయంలోనే, పార్థసారధి తండ్రి రెడ్డయ్య పవన్ ను కలిసి ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం కలకలం రేపుతోంది.అయితే ఇదంతా పార్థసారథికి తెలిసే జరుగుతోందని ఒకరకమైన ప్రచారం జరుగుతున్నా, పార్థసారథికి రెడ్డియ్యకు మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయని, ఆ ఆగ్రహంతోనే రెడ్డయ్య పవన్ కలిసి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఏది ఏమైనా ఈ వ్యవహారం మాత్రం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.