టెక్నాలజీ అంతకంతకు పెరిగిపోతుంది.ఓ రకంగా చెప్పుకోవాలంటే మనం బతుకుతోంది టెక్నాలజీ ప్రపంచంలోనే.
ఈ క్రమంలో మనిషి తాను పనిచేయవలసిన పనులను సులభతరం చేసుకున్నాడు.మనుషులు చేసే పనులలో అత్యంత శ్రమతో కూడుకున్నది వ్యవసాయం.
ఇదే వ్యవసాయం చేయడానికి మనుషులకు ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల రోబోలను వాడి అనేక ఫలితాలను పొందుతున్నారు.అవును.
ముఖ్యంగా ఏదన్నా పండ్ల తోటలో పనిచేయడానికి అనేకమంది కూలీలు అవసరం ఏర్పడుతుంది.కానీ అదే పనిని ఒకే ఒక్క రోబోతో అక్కడ చేసేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎత్తయిన చెట్ల నుంచి పక్వానికి వచ్చిన పండ్లను సుతిమెత్తగా పట్టుకొని కోయడానికి రోబోలు వచ్చేశాయి.తోటలో నేల మీద కదులుతూ స్ట్రాబెర్రీలు, కూరగాయలు, పండ్లను కోసే రోబోలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి.
అయితే, గాలిలో ఎగురుతూ ఎత్తయిన చెట్ల నుంచి పండ్లు కోసే రోబోలను కూడా తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ విజయవంతంగా రూపొందించింది.ఇజ్రాయిల్‌కు చెందిన టెవెల్ ఏరోబోటిక్స్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి స్వతంత్రంగా ఎగురుతూ చెట్ల నుంచి పండ్లను కోసే రోబోలను తయారు చేయడం విశేషం.
కాగా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ద్వారా సెన్సార్లు, కామెరాల సహాయంతో ఈ రోబోలు పనిచేస్తున్నాయి.పక్వానికి వచ్చిన పండ్లనే కచ్చితంగా గుర్తించి కోయగలుగుతున్నాయని టెవెల్ ఏరోబోటిక్స్ సీఈవో యనివ్ మోర్ తెలిపారు.
ఒక వ్యాన్‌పై నాలుగు పండ్లు కోసే రోబోలను వైర్లతో అనుసంధానం చేస్తారు.అవి చెట్లపై ఎగురుతూ పండ్లను కోసి, వాటిని జాగ్రత్తగా వ్యాన్‌పై పెడతాయి.
ఈ రోబోలు ఒక ఆప్‌తో అనుసంధానమై ఉండి రైతుకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి.ఎంత మొత్తంలో పండ్ల కోత పూర్తయ్యింది? ఏదైనా పురుగుమందు లేదా చీడపీడల ప్రభావం ఉందా? అనే విషయాన్ని కూడా రైతుకు తెలియజేస్తాయి.సూపర్ కదూ!
.