ఎప్పుడూ పాలు ఇచ్చే గేదె పాలు ఇవ్వకపోతే ఎవరైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారు.గేదె ఆరోగ్య పరిస్థితి సరిగా లేదేమోనని పశు వైద్యుల దగ్గరికి తీసుకెళ్తారు.
కానీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం ఎప్పుడైనా చూసారా.? కాకపోతే అదే జరిగింది ఇక్కడ.పాలు ఇవ్వడం లేదని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ తన గేదె పై ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బిందు జిల్లాలో చోటు చేసుకుంది.
బాబూలాల్ జాతవ్ అనే రైతు గత కొన్ని రోజులుగా తన గేదె పాలు ఇవ్వట్లేదని, తనని పాలు కూడా పితకనివ్వడంలేదని పోలీసులను ఆశ్రయించాడు.నేరుగా గేదెను తీసుకెళ్లి నాయిగావ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
అంతేకాకుండా ఎవరైనా చేతబడి చేసి ఉంటారని, అందుకే తన గేదె పాలు ఇవ్వడం లేదని ఆ రైతు లిఖితపూర్వకంగా కంప్లైంట్ రాసిచ్చాడు.స్పందించిన పోలీసులు అతడి పరిస్థితి అర్థం చేసుకుని కంప్లైంట్ తీసుకున్నారు.
ఆరోగ్యం సరిగా లేకనే అలా జరిగి ఉంటుందని, అతడికి ఏదోవిధంగా నచ్చచెప్పి పశు వైద్యుడి దగ్గరికి పంపారు.
పశు వైద్యుడు వద్దకు వెళ్లిన రైతు.
గేదెకు వైద్యం చేయించడంతో మరుసటి రోజు నుంచి గేదె పాలు ఇవ్వడం ప్రారంభించింది.

దీంతో తన గేదె పాలు ఇస్తుందని ఆ రైతు సంతోషం వ్యక్తం చేశాడు.అలాగే అందుకు కారణమైన పోలీసులకు కూడా ధన్యవాదాలు చెప్పాడు.అయితే గేదెతో పోలీసు స్టేషన్ కు వెళ్లిన రైతు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.రైతు చేసిన పనికి కోప్పడకుండా సమస్య పరిష్కారం చూపే ప్రయత్నం చేసిన పోలీసులను కూడా నెటిజన్లు అభినందిస్తున్నారు.