భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ఎన్ఆర్ఐలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ శుభవార్త తెలిపారు.
ప్రవాస భారతీయులు పెట్టుబడులు పెట్టేందుకు అవరోధాలుగా ఉన్న పలు నిబంధనలను సడలించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రవాసీ భారతీయ దివాస్ సందర్భంగా జైశంకర్ గురువారం ఆస్ట్రేలియా, సురినామ్, యూఎస్, సింగపూర్, ఖతార్, మలేసియా, యూకే, మారిషస్‌లలో స్ధిరపడిన ఎన్ఆర్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు.
ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు తమ పూర్వీకుల మూలాలను కనుగొనేందుకు తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

సింగపూర్‌కు చెందిన ఓ ఎన్నారై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జైశంకర్ ఇలా అన్నారు.ఒక దేశంగా, ఒక ప్రభుత్వంగా ఎన్నారైలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను త్వరలో తీసుకుంటామని జైశంకర్ చెప్పారు.
ఈ ఏడాది లండన్‌లో ‘‘ప్రవాసీ గ్లోబల్ సీఈవో’’ కాన్ఫరెన్స్ నిర్వహించడం గురించి విదేశాంగ శాఖ తీవ్రంగా ఆలోచిస్తుందని ఆయన అన్నారు.ఇక ఖతార్‌లో భారతీయ కార్మికులు దోపిడీకి గురవుతున్న అంశంపై జైశంకర్ స్పందిస్తూ.
ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా, అప్రమత్తంగా ఉందని… త్వరలోనే ఇమ్మిగ్రేషన్ బిల్లును జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.భారతదేశ అభివృద్దిలో ఎన్ఆర్ఐలు చేస్తున్న కృషికి గుర్తుగా ప్రతీ ఏటా జనవరి 9న భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ దివాస్‌ను నిర్వహిస్తోంది.1915 జనవరి 9న జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చి, స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారు.