గడిచిన కొన్నివారాలుగా కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదుల అలజడి పెరుగుతోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఖలిస్తాన్‌పై సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ రెఫరెండం నిర్వహించి కలకలం రేపింది.
నవంబర్‌లో మరోసారి రెఫరెండం నిర్వహిస్తామని వేర్పాటువాదులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు.ప్రజస్వామ్య సమాజంలో హింసను, మతోన్మాదాన్ని సమర్ధించే శక్తులు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.13వ విదేశాంగ మంత్రుల ఫ్రేమ్ వర్క్ డైలాగ్ తర్వాత సోమవారం ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో జైశంకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవలి వారాల్లో కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్య దేశాలు స్వదేశంతో పాటు ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అర్ధం చేసుకోవడం ముఖ్యమని జైశంకర్ పేర్కొన్నారు.
కాగా.గత నెల 15న టొరంటోలోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిర్‌ను ఖలిస్తాన్ ఉగ్రవాదులు ధ్వంసం చేయడంతో పాటు ఆలయ గోడలపై పిచ్చిరాతలు రాసిన ఘటన కలకలం రేపింది.
ఆ తర్వాత ఖలిస్తాన్‌పై రెఫరెండం జరగడంతో భారత్ తీవ్రంగా స్పందించింది.కెనడా వంటి భారత్‌కు స్నేహపూర్వక దేశంలో భారత్‌కు వ్యతిరేకమైన వేర్పాటువాదుల చర్యలను అనుమతించబడటం తీవ్రమైన అభ్యంతరకరం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
నవంబర్ 6న ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే, భారత విదేశాంగ శాఖ నుండి పదునైన ప్రతిస్పందన తప్పదని విశ్లేషకులు అంటున్నారు.ఈ విషయంలో దౌత్య మార్గాల ద్వారా కెనడాపై భారత్ ఒత్తిడి తెస్తూనే వుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.

కాగా.కెనడాలో ఇప్పటికే స్థిరపడిన.విద్య, వృత్తి, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులకు భారత ప్రభుత్వం గత నెల 23న హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఆ దేశంలో విద్వేషనేరాలు, హింస పెరుగుతున్న నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా వుండాలని అడ్వైజరీ జారీ చేసింది.
విద్వేష నేరాలకు పాల్పడిన వారిపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విదేశాంగ శాఖ పేర్కొంది.అలాగే కెనడాలోని భారత హైకమీషన్ కూడా విద్వేషనేరాలకు పాల్పడుతోన్న వారిపై చర్యలు తీసుకునేలా స్థానిక యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొస్తోందని కేంద్రం తెలిపింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో స్థిరపడిన భారతీయ పౌరులు, వివిధ పనులపై వెళ్లిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.దీనికి ప్రతిగా కెనడా కూడా భారత్‌లోని గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ వెళ్లొద్దంటూ తమ పౌరులను హెచ్చరించింది.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్- కెనడాల మధ్య స్వల్పంగా గ్యాప్ వచ్చినట్లే కనిపిస్తోంది.







