తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 12వ తేదీ అంటే రేపటి నుంచి మొదలు కానుంది.దీనికి అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు.
గతంలో మూడు విడతల్లో చేపట్టిన పాదయాత్రకు అనూహ్యమైన స్పందన రావడం, ప్రజల్లోనూ బిజెపి అగ్ర నేతల్లోనూ ఈ యాత్రపై సంతృప్తి కలగడం, బిజెపిని జనాల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ కావడంతో నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర పై బిజెపి ఆశలు పెట్టుకుంది. దీనికి తోడు త్వరలో జరగబోతున్న మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంజయ్ యాత్రలో ప్రసంగాలు ఉండబోతున్నాయట.
ముఖ్యంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ లను టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసుకున్నారు.ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ… టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టే విధంగా సంజయ్ ప్రసంగాలు ఉండబోతున్నాయి.
మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్ , ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.గణేష్, విజయదశమి నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పాదయాత్రను 10 రోజులకు పరిమితం చేశారు.
ఈ మేరకు పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు.

గతంలో జరిగిన మూడు విడతల పాదయాత్రలలో తెలంగాణ ప్రభుత్వం అనేక ఇబ్బందులు సృష్టించడం, పోలీసులు అనుమతులు నిరాకరించడం, పాదయాత్రలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడం , పాదయాత్ర సమయంలోనే బండి సంజయ్‌ను అరెస్టు చేయడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.దీనిపై కోర్టుకు వెళ్లి మరి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు.దీంతో నాలుగో విడత యాత్ర సందర్భంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.ఈనెల 12వ తేదీన కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని చెట్టారమ్మ ఆలయం వద్ద 10.30 గంటలకు బండి సంజయ్ పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రను ప్రారంభిస్తారు.11 గంటలకు సమీపంలో రామ్ లీలా మైదానంలో ప్రారంభ సభను నిర్వహిస్తారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బాన్సాల్ హాజరవుతారు.
అనంతరం కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్ , ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, పెద్ద అంబర్ పేట్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో పాదయాత్రను ముగిస్తారు.ముగింపు సభకు బిజెపి జాతీయ నాయకులు హాజరు కాబోతున్నట్లు తెలంగాణ బిజెపి ప్రకటించింది.