త్వరలోనే… అతి త్వరలోనే టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దసరా నాటికి పార్టీ పేరును ప్రకటించేందుకు, అలాగే ఆ పార్టీ జెండా గుర్తు కూడా టిఆర్ఎస్ జెండా , గుర్తు అయిన గులాబీ రంగు , కారు గుర్తు ఉండే విధంగా జాగ్రత్తలు పడుతున్నారు.దేశవ్యాప్తంగా తాను పెట్టబోయే పార్టీకి మంచి ఆదరణ , మద్దతు ఉండే విధంగా కేసీఆర్ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా తమకు కలిసివచ్చే అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా… దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవీ కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ కి మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.
దేశవ్యాప్తంగా బీజేపీ గతం కంటే ఎక్కువగా బలపడటం, రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నాయనే సంకేతాలు వెలువడుతూ ఉండడంతో , చాలా రాష్ట్రాల్లోని బీజేపీ వ్యతిరేక పార్టీలు సైతం కేసీఆర్ వెంట నడిచేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదట.
ఇప్పుడు ఈ అంశంపైనే కేసీఆర్ కూడా టెన్షన్ పడుతున్నారట.ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వ్యక్తి జాతీయ పార్టీ పెడితే ఉత్తరాదిలోని ప్రాంతీయ పార్టీలు ఎంతవరకు సమర్థిస్తాయి అనేది కూడా ప్రశ్నగానే మారింది.
ఎందుకంటే ప్రతి పార్టీకి ఒక అజెండా ఉంటుంది.ఆ పార్టీ పరిస్థితులు, ఆ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలు ఇలా అన్నిటిని బట్టి మ్యానేజ్ వేసుకుని పొత్తులు పెట్టుకుంటాయి.
ఇప్పటికే జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బిజెపి కాంగ్రెస్ వంటి పార్టీలతోనే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తాయి తప్ప , కొత్తగా ఏర్పడబోయే పార్టీ వైపు పెద్దగా ఎవరు ఆసక్తి చూపించరు.

ఇప్పుడు ఇదే కెసిఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే కేసీఆర్ ఉత్తరప్రదేశ్ లోని సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీష్ కుమార్ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి వారితో భేటీ అయ్యారు.వీరిలో నితీష్ కుమార్ ప్రస్తుతం ఆర్జెడితో పొత్తు పెట్టుకున్నారు.
ఆయన కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఇక ఆర్జెడి ముఖ్యనేత తేజస్వి యాదవ్ సైతం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ లేని ఫ్రంట్ బిజెపిని ఎదుర్కోలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేయాలని థర్డ్ ఫ్రెండ్ కాకుండా మెయిన్ ఫ్రంట్ గానే ఉండాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు ఇబ్బందికరంగానే మారాయి .ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయానికొస్తే ఢిల్లీ తో పాటు , పంజాబ్ ఎన్నికల్లోను ఆయన పార్టీ గెలవడంతో ప్రధానమంత్రి కావాలనే ఆశయంతో ఆయన ఉన్నారు.అన్ని రాష్ట్రాల్లోనూ తమ పార్టీ శాఖలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ దశలో కేసీఆర్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విషయానికొస్తే ఆమె బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించినా, పూర్తిస్థాయిలో ఆ పార్టీతో వైరం పెట్టుకునేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్టపడడం లేదు .అలా అని కెసిఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ వైపు వచ్చే అవకాశం కనిపించడం లేదు.కేవలం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక్కరే కేసీఆర్ తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.
ఈ దశలో కేసీఆర్ కు జాతీయ పార్టీ స్థాపించిన అంత సానుకూల వాతావరణం అయితే ఉండదనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.







