రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారణమైన భారతీయుడి విషయంలో దుబాయ్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది.బాధిత కుటుంబాలకు 80 వేల దిర్హామ్స్ ( భారత కరెన్సీలో రూ.18 లక్షలు) బ్లడ్ మనీతో పాటు 2 వేల దిర్హామ్స్ (భారత కరెన్సీలో రూ.44,986) జరిమానా విధించింది.వివరాల్లోకి వెళితే… నిందితుడైన 48 ఏళ్ల భారతీయుడు ఈ ఏడాది జూన్ 3న రెసిడెన్షియల్ టౌన్ అయిన అల్ బార్షాలో నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు.ఈ ఘటనలో సౌదీ అరేబియాకు చెందిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారని దుబాయ్ ట్రాఫిక్ కోర్ట్‌కు దర్యాప్తు అధికారులు నివేదించారు.
ప్రధాన రహదారి మధ్యలో రివర్స్ చేస్తున్న కారును భారతీయుడు గమనించకుండా దానిని ఢీకొట్టినట్లు ది నేషనల్ వార్తా సంస్థ నివేదించింది.దురదృష్టవశాత్తూ బాధితుల కారును బంగ్లాదేశ్‌కు చెందిన మరో డ్రైవర్ కూడా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ఈ కేసుకు సంబంధించి సోమవారం జరిగిన విచారణ సందర్భంగా బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.ఇదే కేసులో సహ నిందితుడిగా వున్న బంగ్లాదేశీ లైసెన్స్‌ను కోర్ట్ మూడు నెలల పాటు రద్దు చేసింది.అలాగే 10,000 దిర్హామ్‌ల జరిమానా.3,20,000 దిర్హామ్‌ల బ్లడ్ మనీని చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
ఇదిలావుండగా… పంజాబ్ రాష్ట్రం ముక్తసర్ సమీపంలోని మల్లన్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి ఉపాధి కోసం 2008లో సౌదీ అరేబియాకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో 2013లో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమై బల్వీందర్ సింగ్ దోషిగా తేలాడు.దీంతో కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్షతో పాటు మృతుడి కుటుంబానికి రూ.2 కోట్ల బ్లడ్ మనీ చెల్లించాలని.లేనిపక్షంలో శిరచ్ఛేదం జరపాలని ఆదేశించింది.దీంతో భయపడిన బల్వీందర్ కుటుంబ సభ్యులు రూ.2 కోట్లు చెల్లించినప్పటికీ ఇంత వరకు ఆయనను విడుదల చేయలేదు.