నిన్న విశాఖలో మూడు ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన లు చేయాల్సిన రాజకీయ రచ్చంతా చేసేశాయి.ఒక పార్టీని ఇరుకున పెట్టేందుకు మరో పార్టీ చూపించిన దూకుడు కారణంగా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా… అప్పుడే ఎన్నికలు వచ్చేసాయి అన్నంత స్థాయిలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హడావుడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నిన్న విశాఖలో వైసిపి విశాఖ గర్జనను నిర్వహించింది.అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. విశాఖ గర్జనలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది మాజీ మంత్రులు టిడిపి జనసేన నాయకులను ఉద్దేశించి సంచలన విమర్శలు చేశారు . పవన్ పైన, లోకేష్, చంద్రబాబు పైన వ్యక్తిగతంగా విమర్శలకు దిగారు.దీంతో మూడు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ విశాఖలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేశాయి.
టిడిపి మద్దతుతో అమరావతి పరిసర ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కు వ్యతిరేకంగా మూడు రాజధానులకు మద్దతు పలుకుతూ వైసిపి అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.టిడిపి, జనసేన, బిజెపి వంటి పార్టీలు అమరావతి రైతులకు అండగా నిలబడుతుండగా, వైసీపీ మాత్రమే మూడు రాజధానులను సమర్థిస్తూ తమ రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.
వైసీపీ మద్దతుతో జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన చేపట్టిన రోజునే ఇతర పార్టీలు కూడా సమావేశాలు నిర్వహించాయి.అయితే జనసేన పార్టీ మాత్రం తాము మూడు నెలల ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నామని చెబుతుండగా , తెలుగుదేశం పార్టీ తాము విశాఖ అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నామని చెబుతోంది.

అయితే మూడు పార్టీల రాజకీయ యుద్ధంలో సామాన్యులు కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇప్పటికే జనసేనకు సంబంధించి 89 మందికి పోలీసులు కేసు నమోదు చేశారు.వారికి రిమాండ్ కూడా విధించారు.ఇప్పుడు ఆ కేసులు కారణంగా వారి భవిష్యత్తు ఏమిటి ? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? రాజకీయ పార్టీలు దీనికి బాధ్యత వహిస్తాయా అనే ప్రశ్న సామాన్యుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం అరెస్టు అయినవారు బెయిల్ పై బయటకు వచ్చినా, ఈ కేసుల్లో ఇరుక్కున్న యువకుల భవిష్యత్తు పై మాత్రం తీవ్ర ప్రభావమే చూపిస్తుందనేది వాస్తవం .ఇక నిన్న జరిగిన రచ్చలో విమానశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు దాదాపు 30 మంది వరకు తమ ఫ్లైట్ ను మిస్సయ్యారు.ఇక విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లాల్సిన వారు అనేక గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ రాజకీయ పార్టీల రచ్చ కారణంగా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలతో పాటు, సామాన్య జనం అనేక విధాలుగా నష్టపోవాల్సి వచ్చింది.







