గత కొద్ది రోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి.ఏకంగా ఒక ప్యానెల్ సభ్యుల పై మరొక ప్యానెల్ సభ్యులు మాటల యుద్ధం చేసుకొని పరస్పరం ఒకరిపై ఒకరు ఎన్నో విమర్శలు చేసుకున్నారు.
ఈ విమర్శల అనంతరం జరిగిన ఎన్నికలలో మా అధ్యక్ష పీఠాన్ని మంచు విష్ణు కైవసం చేసుకున్నారు.మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలిచిన తర్వాత ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకొని మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇలా ఎన్నికల ఫలితాల అనంతరం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ప్రకాష్ రాజ్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఎన్నికలలో పోటీకి సిద్ధం అయినప్పటి నుంచి లోకల్ నాన్ లోకల్ అనే వివాదం తెరపైకి వచ్చిందని అలాగే మా సభ్యులు కూడా అధ్యక్ష పీఠంలో తెలుగు బిడ్డ ఉండాలని కోరుకున్నారని ఈ సందర్భంగా ప్రకాష్ రాజు తెలియజేశారు.
నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అతిథిగా వచ్చాను.అతిథిగానే ఉంటానని తెలిపారు.మా కుటుంబంలో అందరం ఒకే తల్లి బిడ్డలమని చాలా మంది చెప్పారు.అయితే ఈ మాట అబద్ధం.
అందుకే మా సభ్యత్వం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకొని రాజీనామా చేసినట్లు తెలియజేశారు.
ఈ క్రమంలోనే రాజీనామా చేయకుండా వచ్చే ఎన్నికలలో పోటీచేసి గెలవచ్చు కదా అన్న ప్రశ్న ప్రకాశ్ రాజ్ కు ఎదురవడంతో ఇలాంటి అజెండా ఉన్నచోట తాను ఎప్పటికీ పని చేయలేనని కుండబద్దలు కొట్టినట్లు తెలియజేశారు.

ఈ విషయానికి పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ ఆయన రాజకీయాలలో రెండుసార్లు ఓడిపోయిన తిరిగి పోటీ చేస్తున్నాడు అని అడగగా రాజకీయాలు వేరు అసోసియేషన్ వేరు అంటూ సమాధానం చెప్పారు.పవన్ కళ్యాణ్ మీకు మద్దతు తెలిపారు కదా అనే ప్రశ్న ఎదురవగా అందుకు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఓటు ఎవరికి వేశారా అనేది తెలియనప్పుడు తను నాకు మద్దతు తెలిపారని ఏ విధంగా అనుకుంటాను.త్వరలోనే ఈ విషయాలన్నింటిని గురించి బాగా విశ్లేషించి అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాననీ తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా మంది సీనియర్ నటులు లోకల్ నాన్ లోకల్ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు.ఈ క్రమంలోనే పక్క రాష్ట్రం నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన నన్ను కొందరు సీనియర్ నటీనటులు ఒక అతిథిగా మాత్రమే భావించారు.వారి అభిప్రాయం మేరకే నేను అతిథిగా కొనసాగుతానని ఇదివరకు దర్శక నిర్మాతలతో ఏవిధమైనటువంటి అనుబంధం ఉండేదో అనుబంధాన్ని అదేవిధంగా కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.