ఆయనది అధికార పార్టీ.పైగా సీనియర్ ఎమ్మెల్యే.
మాములుగైతే నియోజకవర్గంలో ఆయనకు ఎదురుండదు.కానీ, అక్కడ మాత్రం అంతా రివర్స్.
సొంత పార్టీ నేతలే ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఇంతకీ ఆయన ఎవరో కాదు.
విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబురావు, వైసీపీ అధిష్టానికి అత్యంత సన్నిహితుడు.
అన్నీ కలిసి వస్తే.ఈసారి మంత్రి పదవి దక్కుతుందన్న ఆశావహుల్లో ఈయన ఒకరు.
అయితే ఇంతలోనే ఓ సమస్య వచ్చిపడింది.నియోజకవర్గంలోని వైసీపీ కింది స్థాయి నాయకులు ఎమ్మెల్యేపై తిరుగుబాటు జెండా ఎగరేశారు.
ఏకంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గొల్ల బాబురావు తీరుపై ఓ స్థాయిలో ధ్వజమెత్తారు.దీంతో షాక్ కొట్టినట్టయింది సదరు ఎమ్మెల్యే పరిస్థితి.

ఇంతలా ఎమ్మెల్యేపై సొంతపార్టీ నేతలే ఫైర్ అవ్వడానికి ఓ కారణం ఉంది.తమను పట్టించుకోవడం లేదని.నిన్న, మొన్న టీడీపీ, జనసేన నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.తమను కూరలో కరివేపాకు మాదిరి వాడేసుకుని పక్కన పెట్టేస్తున్నారని ఎస్.రాయవరం ఎంపీటీసీ బొలిశెట్టి గోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.బాబురావు ఎమ్మెల్యేగా గెలవడానికి తాము కష్టపడితే.
ఇప్పుడు మేం మీకు అవసరం లేదా అంటూ ఎమ్మెల్యేను సూటిగా ప్రశ్నిస్తున్నారు కిందిస్థాయి క్యాడర్.
తాజాగా ఎమ్మెల్యే బాబురావుకు వ్యతిరేకంగా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి, ఎస్ .రాయవరం, కోటవురట్ల మండలాలకు చెందిన వైసీపీ క్యాడర్ అంతా బంగారమ్మపాలెంలో ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు.బాబూరావు వ్యవహారశైలి మారాల్సిందే అంటూ గట్టిగా డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వైఖరి మీద వారు గుర్రుమనడమే కాకుండా ఆయన ముఖం చూసేది లేదంటూ సమావేశంలో తీర్మానించడం జిల్లా వైసీపీకి షాకింగ్ లాంటి పరిణామంగానే చూడాలి.మరీ, ఈ సమస్యను వైసీపీ అధిష్టానం ఏవిధంగా పరిష్కరిస్తోందో చూడాలి మరీ.