జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది.ప్రజల్లో ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.దీనికి తగ్గట్టుగానే జగన్ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను ప్రకటించడమే కాకుండా , పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో ప్రారంభించిన పథకాలకు నిధుల సమస్య ఏర్పడకుండా ఖచ్చితమైన సమయానికి అన్నిటినీ అమలు చేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ వస్తున్నారు.
అనేక పథకాల పేరుతో జనాలు చేతుల్లో డబ్బులు ఉండేలా చేస్తున్నారు.ఇక ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ పరంగా ఇంటి వద్దనే అన్ని పనులు పూర్తయ్యే విధంగా జగన్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా, జగన్ పరిపాలన తీరుపై సొంత పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు , ఎంపీల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
అఖండ మెజారిటీతో తాము ఎన్నికల్లో గెలిచినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రజలకు స్వయంగా తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉందని, పూర్తిగా జగన్ ప్రజలకు కనెక్ట్ అయిపోయారని, అధికారుల ద్వారా జనాలకు పనులు అయిపోతూ ఉండడంతో, తమను ఎవరూ గుర్తించడం లేదనే బాధ ఎమ్మెల్యేలు, ఎంపీలలోనూ నెలకొంది.
అసలు నియోజకవర్గాల్లో తాము చేసేందుకు ఏమీ లేదు అన్నట్లుగా పరిస్థితి మారిపోవడం ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదు.పార్టీలో ఈ పరిస్థితిని గమనించిన జగన్ దీనికి సంబంధించి నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోగా ఈ విషయాలు బయటపడ్డాయట.

తమ బాధ అధినేత జగన్ కు చెప్పుకుందాము అంటే ఆయన కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, పోనీ ప్రజల్లో తిరుగుతూ వారి పనులు చక్కబెట్టే అవకాశం లేకుండా పోయిందని, ఇక ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రయోజనం ఏముంది అనే అసంతృప్తి చాలామందిలో ఉండటం, కోట్ల కొద్ది అప్పులు చేసి మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచామని, కానీ ఇప్పుడు ఆ సొమ్మును రాబట్టుకునే అవకాశం కూడా లేకుండా పోవడంతో ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది తమ సొంత వ్యాపార వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారట.పక్క రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటూ బిజీగా గడుపుతున్నారట.అయితే ఈ పరిణామాలపై జగన్ సైతం ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.త్వరలోనే ఎంపీలు ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి వారి ఉత్సాహం రేకెత్తించే విధంగా వ్యవహారాలు చేయాలని ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.