మనకి భవిష్యత్తులో ఏదైనా కష్టం వస్తుంది అనే విషయం మనకి ముందే తెలిసినపుడు దానికి గల నివారణలు ముందే తెలుసుకొని అప్రమత్తంగా ఉంటాం.అయితే అలాంటి విషయాలు మనకు ఎవరు చెబుతారు? జ్యోతిష్యులు చెబుతారా? దానిని నమ్మలేము.మరి ఇంకెవరైనా ఇక్కడ మన కష్టాలను గురించి ముందే ఊహించి చెప్పగలరా? కష్టమే.ఆ దేవుణ్ణి అడిగే ధైర్యం మనము ఎలాగూ చేయలేము.
ఎందుకంటే అంత శక్తి నేటి మానవుడికి లేదు కాబట్టి.అయితే అలాంటి విషయాలు ఓ యంత్రం చెబితే ఎలావుంటుంది? ఐడియా సూపర్ కదూ.ప్రస్తుతం అలాంటి సాంకేతికత తీసుకురాబోతున్నారు శాస్త్రవేత్తలు.మరీ ముఖ్యంగా అది మీ మనసులో ఉన్న మాటను సరిగ్గా చెప్పేస్తుందట.
విస్మయం కలుగుతుంది కదా? ప్రస్తుతానికి కాల్పనిక సైన్స్‌లానే అనిపిస్తున్నా.రానున్న దశాబ్ద కాలంలో ఇలాంటి కొంగొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వ్యక్తుల ప్రవర్తన తీరును క్షుణ్నంగా పరిశీలించి.అచ్చం వారి తరహాలో ప్రవర్తించే ‘డిజిటల్ కవల’లను రూపొందించొచ్చని వివరిస్తున్నారు.
సృష్టిలో ప్రతిఒక్కరికీ ఓ విలక్షణ శైలి ఉంటుంది.ఈ నేపథ్యంలో కెనడా శాస్త్రవేత్తలు ప్రతి వ్యక్తికి తాము డిజిటల్ కవలలను సృష్టించగలమని ధీమా వ్యక్తం చేయడం విశేషం.
వ్యక్తుల ప్రవర్తన శైలి, ప్రాధాన్యతలు, ఇష్టాయిష్టాలు, వారి చుట్టూ ఉండే వాతావరణం, సామాజిక పరిస్థితులు వంటి సమాచారమంతా సేకరించి.దాన్ని కృత్రిమ మేధ (ఏఐ)తో జోడించడం ద్వారా డిజిటల్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఓ వ్యక్తి ఓ షాపింగ్ మాల్ కి వెళ్ళాక ఏం కొనుగోలు చేస్తాడన్న సంగతి నుంచి మొదలుకొని, ఏయే పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో అన్నీ ‘డిజిటల్ కవల’ ముందే చెప్పేయగలదని వివరించారు.మరి ఇలాంటి రోబోలను ఎప్పటికి తుసుకొస్తారో చూడాలి మరి!





 

