మూడు వారాల క్రితం గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్లో అంతకంతకూ ఆసక్తి పెంచుతూ మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోపై సెలబ్రిటీలు విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ప్రేక్షకులు మాత్రం బిగ్ బాస్ ను గతంలో తీవ్రస్థాయిలో ట్రోల్ చేయలేదు.
అయితే దేవి నాగవల్లిని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడంపై గత రెండు రోజుల నుంచి బిగ్ బాస్ షోపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తాజాగా దేవి నాగవల్లి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడానికి గల కారణాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లేడీ బిగ్ బాస్ అంటూ హౌస్ లోకి అడుగుపెట్టిన దేవి తన ఎలిమినేషన్ పై అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.ఎలిమినేషన్ తనను షాక్‌కి గురి చేసిందని దేవి నాగవల్లి వెల్లడించారు.
సీరియస్ గా తనను విలన్ గా చిత్రీకరించారని ఆమె పేర్కొన్నారు.

తనకు ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే ఎక్కువ ఓట్లు వచ్చినా తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి ఎలిమినేట్ చేయడం దారుణమని అన్నారు.బిగ్ బాస్ నుంచి ఏ ఇమేజ్ తో బయటకు వచ్చామనేది ముఖ్యమని దేవి వెల్లడించారు.బిగ్ బాస్ ప్రేక్షకులు తన ఎలిమినేషన్ ను ఖండిస్తున్నారంటే తాను విన్ అయినట్టేనని అన్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశం రాదని అనుకుంటున్నానని ఆమె చెప్పారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశం ఇస్తే మాత్రం తప్పక వెళతానని దేవి నాగవల్లి వెల్లడించారు.
తన ఎలిమినేషన్ విషయంలో ఎవరినీ తప్పు పట్టనని అయితే వాళ్ల షో వాళ్ల ఇష్టం అంటూ కామెంట్ చేశారు.ఎలిమినేషన్ లో ఏదో తిరకాసు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన వల్ల బిగ్ బాస్ స్క్రిప్ట్ మారిపోతుంది కాబట్టి.వాళ్లు అనుకున్న గేమ్ ప్లాన్ రావడం లేదు కాబట్టి తన ఎలిమినేషన్ జరిగి ఉండవచ్చని చెప్పారు.
బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ కాదని అయితే మిగతా కంటెస్టెంట్లు స్క్రిప్ట్ రాసుకొచ్చారో లేక వాళ్లకు ఇచ్చారో తెలియదని అంటూ బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అనిపించేలా కొత్త అనుమానాలను దేవి నాగవల్లి తెరపైకి తెచ్చారు.