తెలంగాణ ఆంధ్ర ఒక్కటే.రాష్ట్రాలు రెండు వేరైనా అన్ని విషయాల్లో సామరస్యపూర్వకంగా సహకరించుకుంటూ ముందుకు వెళ్తాము అంటూ గతంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.
ప్రకటించడమే కాదు , విభజన కు సంబంధించి ఎన్నో అంశాలలో కలిసి కూర్చుని మాట్లాడుకుని చాలా సమస్యలకు పరిష్కారం వెతుక్కున్నారు.ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది .రెండు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన అంశాలలో రెండు రాష్ట్రాలు కోర్టులకు వెళ్లి అక్కడే వ్యవహారాలు తెల్చుకుంటాయి అని అందరూ ఊహించినా, జగన్ కేసీఆర్ మాత్రం 1,2 మీటింగ్ లలోనే అన్ని సమస్యలకు చెక్ పెట్టేసుకున్నారు.అసలు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు జగన్ కు కేసీఆర్ సహకరించడం తదితర కారణాలతో జగన్ ఎప్పుడు కేసీఆర్ కు ఆ స్థాయిలో గౌరవ మర్యాదలు ఇస్తూనే వస్తున్నారు.
అదే రీతిలో కేసీఆర్ వ్యవహారశైలి ఉంటూ వస్తోంది.అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తాయి.
గతంలోనే ఈ విభేదాలు తెరపైకి వచ్చినా, వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం అయ్యింది.అయితే ఇప్పుడు మాత్రం రెండు రాష్ట్రాలు ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
గతంలో మాదిరిగానే చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నా, కోర్టులోనే వ్యవహారం తెలుసుకునేందుకు రెండు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.కోర్టులో ఈ వ్యవహారాలు ఆషామాషీగా తేలుతాయా అంటే దశాబ్దాల సమయమే పడుతుంది.
దశాబ్దాలుగా కర్ణాటక, మహారాష్ట్ర మధ్య నెలకొన్న నీటి వివాదాలు ఇప్పుడు ఒక కొలిక్కి వస్తున్నాయి. ముందుగా ఈ రెండు రాష్ట్రాలు కోర్టులో ఈ వ్యవహారాన్ని తేల్చుకునేందుకు సిద్ధమైనా, అక్కడ ఈ కేసు పెండింగ్ లో ఉండటం తదితర కారణాలతో కర్ణాటక సీఎం యడుయూరప్ప, మహారాష్ట్ర మంత్రి ఈ జల వివాదంపై చర్చించుకుని ఒక పరిష్కారాన్ని వెతుక్కున్నారు.

ఇప్పుడు ఆ తరహా లోనే ఏపీ తెలంగాణలో మధ్య జల వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉన్నా, కోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని చూస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఎన్నికల దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ జల వివాదాలను తెరపైకి తెచ్చారని, అందుకు ఏపీ సీఎం జగన్ తో వైరం పెట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారు అనే అనుమానాలు, విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.ఏదిఏమైనా రెండు రాష్ట్రాల మధ్య వివాదం చర్చల ద్వారానే ఒక పరిష్కారం లభిస్తుంది తప్ప కోర్టుల వరకు వెళ్లినా, ఇప్పట్లో అయితే పరిష్కారం లభించే అవకాశం కనిపించడం లేదు.అప్పటి వరకూ రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది.