ఖమ్మం, సెప్టెంబర్ 11: జిల్లాలో దళితబంధు లబ్దిదారుల ఖాతాలకు మంజూరు మొత్తం జమచేసినట్లు జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో చింతకాని మండలాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసినట్లు, ఇందులో భాగంగా మండలంలో 3462 మంది దళితులను లబ్దిదారులుగా గుర్తించి దళితబంధు లబ్ది చేకూర్చామన్నారు.
జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపికచేసినట్లు, ఒక్క వైరా నియోజకవర్గంలో జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్నందున 83 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.చింతకాని మండలంలో గుర్తించిన 3462 మంది లబ్ధిదారులకు రూ.9.90 లక్షల చొప్పున 346.20 కోట్లు, 5 నియోజకవర్గాల్లో 483 మంది లబ్ధిదారులకు రూ.9.90 లక్షల చొప్పున రూ.48.30 కోట్లు వారి వారి ఖాతాల్లో జమచేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇందులో దళితబంధు రక్షణ నిధి క్రింద చింతకాని మండలంలో రూ.3 కోట్ల 46 లక్షల 20 వేలు, 5 నియోజకవర్గాలకు సంబంధించి రూ.48 లక్షల 30 వేలు కేటాయించినట్లు ఆయన అన్నారు.5 నియోజకవర్గాలకు సంబంధించి 483 లబ్ధిదారులకు యూనిట్లను సంపూర్ణంగా గ్రౌండింగ్ చేసినట్లు, చింతకాని మండలానికి సంబంధించి ఇప్పటికి 1052 మంది లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేశామని, మిగతా యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ పురోగతిలో ఉందని ఆయన తెలిపారు.చింతకాని మండలానికి కావాల్సిన నిధులు మొత్తం ప్రభుత్వం నుండి విడుదల అయి, లబ్దిదారుల ఖాతాల్లో జమ అయినందున, మిగులు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్ అన్నారు.
దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పధకం చాలా గొప్ప పధకమని, ప్రభుత్వం అందిస్తున్న ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.