ఓటమే గెలుపునకు నాందియని పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు.అయితే, రాజకీయంలో గెలుపు ఓటములు ఎప్పుడు ఎలా ఎంటాయో చెప్పడం చాలా కష్టం.
కానీ, ఓటమిని తట్టుకుని నిలబడగలిగిన వారికి మాత్రం అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పడానికి ఈ ముగ్గురు నేతలే ప్రత్యక్ష ఉదాహరణ.వారివి భిన్నమైన పార్టీలు కాగా, అసెంబ్లీ ఎన్నిక్లలో ఓటమిపాలైన వెంటనే కోలుకుని ప్రజాక్షేత్రంలో నికరంగా నిలబడి తమ సత్తా చాటుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి వారి కీర్తి ఢిల్లీ వరకూ చాటుకుని తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.వారే గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఎనుముల రేవంత్‌రెడ్డి.
గంగాపురం కిషన్‌రెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం పొందారు.వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరుగాంచి హైదరాబాద్ అంబర్‌పేట స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమిని చూసి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు.నిజాయితీ గల నాయకుడు ఓడిపోవడం చూసి బాధపడ్డారు.
ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికలు రాగా, సికింద్రాబాద్ ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొంది రికార్డు సృష్టించాడు.తొలిసారి ఎంపీ అయినప్పటికీ మోడీ కేబినెట్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొలువుదీరాడు.ఇక తాజాగా మోడీ కేబినెట్ 2.0లో కిషన్‌రెడ్డికి ప్రమోషన్ లభించింది. కేంద్ర కల్చరల్, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.కేంద్ర కేబినెట్ ర్యాంకు పొందిన తొలి తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి రికార్డు సృష్టించారు.
తెలుగువాడైన కిషన్ రెడ్డికి ఆ స్థానం లభించడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు.అయితే, సిట్టింగ్ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గెలుపు ఇక కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు.కానీ,
గులాబీ ఊపులో ఆయన ఓటమి పాలయ్యాడు
అంతటితో ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండదేమోనని పలువురు ఆయన అభిమానులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు.కానీ, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల వరకు పుంజుకున్నాడు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం టికెట్ తీసుకుని, బరిలో నిలిచి విజయాన్ని సాధించాడు.ఇక అప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌కు అండదండలిస్తూ రాష్ట్రవ్యాప్తంగ క్రేజ్ సంపాదించుకున్నారు.
సీనియర్లు ఆయన పట్ల పలు విమర్శలు ప్రతీ రోజు చేస్తున్నప్పటికీ హై కమాండ్ దృష్టిలో క్లీన్ ఇమేజ్ పొందాడు.అంతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పదవి ఆయన్ని వరించింది.
యోధానుయోధులు, తలలు పండిన సీనియర్లు ఉన్నప్పటికీ టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియమితులయ్యారు.కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపాడు.

2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ ప్రజల మనసును చూరగొనలేకపోయారు బీజేపీ నేత బండి సంజయ్ కుమార్.అయితే, కార్యకర్తల బలం ప్రజల్లో ఉండటం మాత్రం మరిచిపోలేదు.2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నుంచి బీజేపీ తరఫున పోటీచేసి అనూహ్య విజయం సాధించారు.యూత్‌లో ప్రత్యేక క్రేజ్ పొందిన సంజయ్ సమస్యల పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు పార్టీకి విధేయుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఈ క్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఎవరు నియమించబడుతారు? అని అందరూ ఎదురుచూస్తుండగా ఆయన్ను అవకాశం వరించింది.బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి పార్టీ దూకుడు పెంచి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు.
అలా రాష్ట్ర రాజకీయాల్లో నుంచి దేశరాజకీయాల్లో తనకూ ఓ స్థానం ఏర్పరుచుకున్నారు.