ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి తుదిదశకు చేరుకుంది.దేశ వ్యాప్తంగా కరోనా కొత్త కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి.
అలాగే వ్యాక్సిన్ తయారీ కూడా తుది దశకు చేరుకుంది.ఈ నెలలో లేదా జనవరి నెలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి.ఇండియా 30 కోట్ల డోసుల కొనుగోలుకు సిద్ధమైంది.రూ.10వేల కోట్ల నిధులను కూడా ఇందుకోసం ఖర్చుపెట్టబోతున్నారు.కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయనున్నారు.వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని ఆయా రాష్ట్రప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
అయితే కరోనా వ్యాక్సిన్ తెలంగాణకి చేరిన కొద్ది గంటల్లోపే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభించాలని వైద్యారోగ్యశాఖ చర్యలు చేపడుతోంది.దాదాపు 3 కోట్ల డోసుల నిల్వలకు సరిపడా ప్రత్యేక కోల్డ్ చైన్ కేంద్రాల ఏర్పాట్లు చేస్తోంది.
ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ తెలంగాణలో ఎవరికి ఇవ్వబోతున్నారనే విషయంపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి నర్సుకి మొదటి కరోనా వ్యాక్సిన్ ఇచ్చి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని వైద్యారోగ్యశాఖ భావిస్తోందని సమాచారం.తొలివిడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా ఇవ్వనున్నారు.ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని వైద్య సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు, 65 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ముందస్తు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.ఇందులో భాగంగానే మొదటి వ్యాక్సిన్‌ను ఆ నర్సుకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.16 ఏళ్ల లోపు వారిపై కరోనా వ్యాక్సిన్ ఇంకా పరీక్షించనందున వారికి కోవిడ్ టీకా వేసే అవకాశం లేదని సమాచారం.