2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన ఏడాదిన్నర కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా.
అదే స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.
నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా..లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.
రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.అయితే నాలుగేళ్లు కావొస్తున్నా కరోనా మహమ్మారి పీడ ఇంకా ఈ భూగోళాన్ని విడిచిపెట్టడం లేదు.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కోవిడ్ పంజా విసురుతూనే వుంది.ఇటీవల ఒమిక్రాన్ పీడ పోయిందని… ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ దాని ఉప రకాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.
ప్రస్తుతం చైనా, హాంకాంగ్‌లను వైరస్ అల్లాడిస్తోంది.

తాజాగా బ్రిటన్‌లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి.ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో తీవ్రత ఎక్కువగా వుందని స్కై న్యూస్ నివేదించింది.దీనిని కొందరు నిపుణులు ఫోర్త్ వేవ్‌గా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంగ్లాండ్‌లో ఇప్పటి వరకు 15,13,700 మందికి పాజిటివ్‌గా తేలింది.ఇది జనాభాలో 2.78 శాతానికి సమానం.వేసవి కాలంలో కేసులు తగ్గుముఖం పట్టగా… ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో కరోనా తీవ్రత పెరిగింది.2 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల వారు మినహా అన్ని వయసుల వారు కోవిడ్ బారినపడుతున్నారని నివేదిక చెబుతోంది.
ఇటీవలి వారంలో ఇంగ్లాండ్, వేల్స్‌లో వృద్ధులలో గణనీయమైన పెరుగుదల నమోదైనట్లుగా తెలుస్తోంది.ఆదివారంతో ముగిసిన వారంలో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 1,00,000కి 12.6కి పెరిగింది.అయితే కోవిడ్ సంబంధిత మరణాలు మనుపటి కంటే తక్కువగా వున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.ఇంగ్లాండ్‌లో ప్రతి 35 మందిలో ఒకరు, వేల్స్‌లో ప్రతి 40 మందిలో ఒకరు, ఉత్తర ఐర్లాండ్‌లో ప్రతి 40 మందిలో ఒకరు, స్కాట్లాండ్‌లో ప్రతి 50 మందిలో ఒకరు కోవిడ్ బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.







