గత కొద్దిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( MLC Jeevan Reddy ) పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తి వెళ్లగక్కడమే కాకుండా, పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) హెచ్చరికలు చేశారు.ఒక దశలో జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై ఈరోజు జీవన్ రెడ్డి స్పందించారు.కాంగ్రెస్ లో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలను తాను జీర్ణించుకోలేకపోతున్నానని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు .ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలు పాటించాలని కోరారు.ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమని , గతంలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ పోరాటం చేశారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.గత పదేళ్లుగా కష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తాను ఉన్నానని , ఇతర పార్టీల నుంచి పదవులు వచ్చినా తాను ఎప్పుడూ కాంగ్రెస్ వీడి వెళ్లలేదని అన్నారు.పదేళ్లు బీ ఆర్ ఎస్ పార్టీతో తాను పోరాటం చేశానని , గతంలో కాంగ్రెస్ ఖాళీ కావడానికి ప్రధాన కారణమైన పోచారం శ్రీనివాస్ రెడ్డిని( Pocharam Srinivas Reddy ) తిరిగి పార్టీలో చేర్చుకోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, కీలక పదవిని కట్టబెట్టడం దారుణమని అన్నారు .పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలి తప్ప, ఫిరాయింపు చేసిన నేతలకు కాదని జీవన్ రెడ్డి హితవు పలికారు.తన ప్రధాన అనుచరుడిని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్( MLA Sanjay Kumar ) చంపించారని జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లుగా బీ ఆర్ ఎస్ పార్టీతో పోరాడిన తనకు కాంగ్రెస్ లో మంచి బహుమతి లభించిందని అన్నారు.
తనతో చర్చించకుండానే తన ప్రత్యర్థిని కాంగ్రెస్లో చేర్చుకోవడం తో తాను కాంగ్రెస్ శ్రేణులకు ఏమని సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.