తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.పీసీసీ చీఫ్ రేవంత్ తనదైన వ్యూహంతో దూకుడుగా ముందుకెళ్తూ టీఆర్ఎస్ పై విమర్శల దాడిని పెంచుతూ క్షేత్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు కాంగ్రెస్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకరావాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.
అయితే మొన్నటి వరకు కలహాల పార్టీగా పేరొందిన కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరూ ఐక్య రాగం వినిపిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఇందిరా పార్క్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్ష లో ఉప్పు నిప్పులా ఉండే కోమటి రెడ్డి వెంకట రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరూ చాలా నవ్వుతూ కనిపించడం ఒక్కసారిగా అక్కడున్న కాంగ్రెస్ నేతలు మాత్రమే కాక మీడియా కూడా పెద్ద ఎత్తున అందరూ కలిసి నడుస్తారని భావించినా తిరిగి పరిస్థితులు మాత్రం యధాతధ స్థితికి చేరుకున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
తాజాగా అమరవీరుల స్తూపం ను కాంగ్రెస్ బృందంతో కలసి సందర్శించిన సమయంలో కెసీఆర్, కెటీఆర్ లను సామాజికంగా బహిష్కరించాలని, వీరిని ఎవరూ విందులూ, వివాహాలకు ఆహ్వానించవద్దని మీడియా ముఖంగా పదునైన విమర్శ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత కోమటిరెడ్డి వెంకట రెడ్డి కుటుంబ వివాహానికి కెటీఆర్ ను ఆహ్వానించడంతో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పీసీసీ చీఫ్ ఆదేశాలను ముందుగా మీ పార్టీ వారిని పాటించుమని చెప్పు అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజకీయం వేరు వ్యక్తిగత జీవితం వేరు అనే సంకేతాలను పరోక్షంగా రేవంత్ రెడ్డికి స్వంత పార్టీ నేతలే చెప్పకనే చెప్పడం రేవంత్ ఆదేశాలకు పార్టీలో ఎంత విలువుందనేది అర్ధమవుతుందని ప్రత్యర్థి పార్టీల నేతలు కామెంట్స్ చేస్తున్నారు.