తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) లో చేరికల గందరగోళం నెలకొంది.ఇటీవల కాలంలో బీఆర్ఎస్ లోకి చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండడంతో, కాంగ్రెస్ బిజెపితో పాటు, మిగతా చిన్నా చితకా పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు బీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్నారు.
కొంతమంది నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు తెలియకుండానే తెలంగాణ భవన్ లో ఆ పార్టీ అగ్ర నేతల సమక్షంలో పార్టీలో చేరిపోతున్నారు.ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ప్రత్యర్థుల సైతం ఎవరితో సంబంధం లేకుండా బీఆర్ఎస్ కండువా కప్పుకుంటున్నారు.
దీంతో కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగించాలా వద్దా అనే విషయంలో ప్రస్తుత అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు.వారు కోవర్ట్ రాజకీయం చేసేందుకే పార్టీలో చేరారా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి.
చేరిన వారికి పూర్తిస్థాయిలో నమ్మకం పెట్టుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు.ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ ఎస్ లో చేరుతున్నారు .ముఖ్యంగా మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు వంటి వారు కొంతమంది బిజెపి, కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.దీంతో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు చోటు చేసుకుంటున్నాయి.
అయితే ఆయా నియోజకవర్గ అభ్యర్థులకు తెలియకుండానే ఈ చేరికలు చోటు చేసుకుంటూ ఉండడంతో , అభ్యర్థులు ఈ విషయంపై కాస్త అసంతృప్తిగానే ఉన్నారట.ముఖ్యంగా తమ నియోజకవర్గానికి చెందిన నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు వారి ఇళ్లకు వెళ్లి మంతనాలు చేస్తున్నారు.
అయినా పార్టీ నుంచి కనీసం సమాచారం ఉండకపోవడం, చాలా చేరికలు అభ్యర్థులు లేకుండానే జరిగిపోతుండడం వంటివి వాళ్లలో అసంతృప్తిని రాజేస్తున్నాయి.
తాజాగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో రామ్మోహన్ గౌడ్, మంత్రి హరీష్( Harish rao ) రావు పార్టీలో చేర్చుకునే సందర్భంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి లేకుండానే ఆ చేరిక చోటు చేసుకోవడం, అలాగే మానుకొండూరు నియోజకవర్గం నుంచి బిజెపి నేత గడ్డం మధు చేరే సమయంలో స్థానిక అభ్యర్థి రసమయి కిషన్( Rasamayi bala kishan ) లేకుండానే ఈ చేరిక చోటు చేసుకోవడం , కూకట్ పల్లి కాంగ్రెస్ నేత గొట్టిముక్కల వెంగళరావు , ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు చివరి నిమిషంలో సమాచారం ఇవ్వడం వంటివి ఇటీవల కాలంలో చేరికల వ్యవహారంలో గందరగోళం సృష్టిస్తున్నాయి.దీంతో ఈ చేరికలు తమకు కలిసి వస్తాయా లేక చేటు తెస్తాయా అనే విషయం పై గందరగోళానికి గురవుతున్నారు.