పోలవరం నిర్వాసితులకు పరిహారం స్వాహా.కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు నారా లోకేష్ లేఖ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన లక్షలాది మంది నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
తప్పుడు పత్రాలతో దొడ్డిదారిలో వైసీపీ నేతలే నిర్వాసితులకు పరిహారం స్వాహా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.దీనిపై తక్షణ దర్యాప్తు జరపాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు.
ఇటీవలే పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి అపష్కృత సమస్యలు తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే అది పెద్ద కుంభకోణం బయటపడిందన్నారు.లక్షలాది మంది నిర్వాసితులలో అత్యధికలైన ఆదివాసులను అధికారుల అండతో కొందరు వైసీపీ నేతలు ఎంతో దారుణంగా మోసగించారో పత్రాలు, సాక్ష్యాలు, గుణంకాలంతో సహా వెల్లడైందని తెలిపారు.
తాను ఆర్టీఐ ద్వారా, అధికారుల ద్వారా పొందిన సమాచారం, క్షేత్రస్థాయిలో తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కేంద్ర విజిలెన్స్ కమిషన్ కి లేఖ లో తెలియజేశారు.ఇప్పటికి దాదాపు 12 మంది నకిలీ ఢీ ఫారాలతో రూ.10 లక్షల నుంచి రూ 52 లక్షల మేర పరిహారం పొంది దాదాపు రూ.3 కోట్ల వరకు కాజేశారని, దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా ఎన్ని కోట్ల పరిహారం స్వాహా చేశారు అనేది కేంద్ర విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు చేసి తేల్చాలని లేఖలో కోరారు.వాస్తవ నిర్వాసితుల పేర్లు, సర్వే నెంబర్లు వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని వైసీపీ నేతలు ఎలా స్వాహా చేశారోఆధారాలను లేఖకు జత చేసినట్లు తెలిపారు.

పోలవరం నిర్వాసిత గ్రామమైన కె.కొత్తగూడెం తోపాటు చాలా గ్రామాల్లో ఇదే రకమైన కుంభకోణం జరిగిందని ఆదివాసులకు అన్యాయం చేస్తున్న నేతలు సహకరించని అధికారులపై చర్యలు తీసుకుని, పరిహారాన్ని రికవరీ చేసి అసలైన నిర్వాసితులకు అందజేయాలని కోరారు.వైసీపీ నేతలతో కలిసి స్థానిక వీఆర్వోలు తప్పుడు అడంగల్ రికార్డులు సృష్టించారని, వీటిని పరిశీలించకుండానే ఉన్నతాధికారులు పెద్దమొత్తంలో పరిహారం చెల్లించినట్టే పేర్కొన్నారు.