టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ సంచల నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ శ్రేణులకు ప్రతిపక్షాలకు ప్రజలకు ట్విస్ట్ లు ఇస్తూ ఉంటారు.ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, అంతిమంగా తమ పార్టీకి ప్రభుత్వానికి కలిసి వచ్చే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటూ ఉంటాయి.
తాజాగా తెలంగాణ భవన్ లో శనివారం రాత్రి నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశంలో కేసీఆర్ ఎన్నో సంచలనాలను ప్రకటించారు.దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్ర జాతీయ రాజకీయాలతో పాటు , అనేక అంశాలపై మాట్లాడుతూ ఎన్నో సంచలన విషయాలను ప్రకటించారు.ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని కేసీఆర్ తేల్చేశారు. ” సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని నా విధానం.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం ఖాయమే అయినా, కొందరు పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 72 నుంచి 80 స్థానాలు మనమే గెలుస్తాం.
కొద్దిగా కష్టపడితే 90 నుంచి 100 సీట్లు సాధించడం ఖాయం.ఎక్కడా పొరపచ్చాలు రాకుండా వారితో కలిసి వనభోజనాలు చేయండి.
దళిత బంధు , ఆసరా పెన్షన్లు తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళండి.మనం చేసిన కార్యక్రమాలను ప్రజలకు విడమర్చి చెప్పకపోవడంతో అయోమయం ఏర్పడుతోంది.

ఇకపై హైదరాబాద్ ను ఖాళీ చేసి నియోజకవర్గాలపై దృష్టి పెట్టండి” అంటూ కేసిఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సూచించారు.ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల జాబితాలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ అందించారు.నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారులను దళిత బంధు పథకం కింద వెంటనే ఎంపిక చేయాలని లబ్ధిదారులకు ఇచ్చేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, సొంత స్థలం ఉండి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించుకునేందుకు వీలుగా నియోజకవర్గానికి మూడు వేల మంది లబ్ధిదారులను డిసెంబర్ లోగా ఎంపిక చేయాలని కెసిఆర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా కేంద్ర అధికార పార్టీ బిజెపిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ, అమిత్ షా వంటి బిజెపి అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు టిఆర్ఎస్ పై విమర్శలు చేయడం తప్పించి తెలంగాణకు చేసిందేమిటో చెప్పడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వంటి వారు రాష్ట్రానికి వచ్చి ప్రధాని ఫోటో లేదు అంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కెసిఆర్ ఫైర్ అయ్యారు.బిజెపి వద్ద ఏమీ ఉండదు , బిజెపి మత పిచ్చి రాజకీయాల పట్ల మొదట్లో రాష్ట్రంలో కొంత ఆసక్తి వ్యక్తం అయినా, ఇప్పుడు ఎవరు పట్టించుకోవడంలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ఈనెల 6 ,12 ,13వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ఈనెల 16, 17 ,18 తేదీల్లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో నిర్వహించాలని కేసీఆర్ సూచించారు.







