కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికార పార్టీ వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి.ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి.
మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ బాలశౌరిని పేర్ని నాని అనుచరులు అడ్డుకున్నారు.అంతటితో ఆగకుండా గోబ్యాక్ బాలశౌరి అంటూ నినాదాలు చేశారు.
దీంతో ఎంపీ బాలశౌరికి చిర్రెత్తుకొచ్చింది.దీంతో పేర్ని నానిపై ఆయన ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.
బందరు నీ జాగిరా అంటూ పేర్ని నానిని బాలశౌరి నిలదీశారు.
బందరులో తమకు సంబంధించిన స్మశానవాటికను అభివృద్ధి చేయాలని కొందరు ముస్లింలు ఇటీవల ఎంపీ బాలశౌరిని కోరారు.
దీంతో బాలశౌరి మచిలీపట్నంలో పర్యటించి స్మశానవాటికను పరిశీలించేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అయితే పేర్ని నాని కీలక అనుచరుడు, 33వ డివిజన్ కార్పొరేటర్ అస్గర్‌అలీ తన వర్గీయులతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అయినా సరే ఎంపీ వెనక్కు తగ్గలేదు.
ప్రజా సమస్యలను పరిశీలించేందుకు వెళ్తుంటే తనను అడ్డుకోవడం ఏంటని బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్లబోయారు.
దీంతో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య తోపులాట జరిగింది.దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నాని వర్గీయులను అక్కడి నుంచి పంపేశారు.
అయితే మూడేళ్ళ నుంచి సొంత పార్టీ ఎంపీ అయిన తననే మచిలీపట్నం రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేశారు.పది రోజులకు ఒకసారి తన ప్రత్యర్ధి కొనకళ్ల నారాయణను పేర్ని నాని కలుస్తుంటారని.తాను కూడా కొల్లు రవీంద్రను కలవాలా అని నిలదీశారు.
ముఖ్యమంత్రిని అవినీతి పరుడని విమర్శించిన బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని కార్యక్రమంలో పేర్ని నాని ఎందుకు పాల్గొన్నారని బాలశౌరి ప్రశ్నించారు.తన నియోజకవర్గంలో సమస్య పరిశీలనకు వెళ్తుంటే అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని ఖరాఖండిగా చెప్పేశారు.
ఇక నుంచి నేను బందరులోనే ఉంటా.ఎవరేం చేస్తారో చూస్తా.
ఎంపీ అంటే ఏంటో చూపిస్తా అని హెచ్చరించారు.