ఈ ఐపీఎల్ సీజన్-16( IPL Season-16 ) ఎంతో ఆసక్తికరంగా మొదలై.ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ, ఫైనల్ ( Final match )మ్యాచ్ గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మలుపులు తిరిగి చివరికి చెన్నై ( CSK )జట్టు టైటిల్ గెలిచింది.
ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్ లో రెండు బంతులకు 10 పరుగులు అవసరం ఉండగా రవీంద్ర జడేజా( Ravindra jadeja ) 6,4 లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చి చెన్నై జట్టును గెలిపించాడు.చెన్నై జట్టు ఓడిపోయే దశకు చేరే సమయంలో మ్యాచ్ మలుపు తిరగడంతో ఐదవ సారి ఐపీఎల్ టైటిల్ చెన్నై జట్టు ఖాతాలో పడింది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ( GT )జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.తరువాత 215 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నై జట్టు మూడు బంతులకు 4 పరుగులు చేశాక వర్షం అంతరాయం కలిగించింది.దీంతో ఓవర్లను తగ్గించి 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని అంపైర్లు నిర్ణయించారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఓపెనర్లు శుభ ఆరంభం అందించారు.రుతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో 26 పరుగులు, డెవాన్ కాన్వే 25 బంతుల్లో 47 పరుగులు చేయడంతో చెన్నై జట్టు 6.2 ఓవర్లలో 74 పరుగులు చేసింది.
ఇక శివం దుబే 21 బంతుల్లో 32 పరుగులు, అజింక్య రహానే 13 బంతుల్లో 27 పరుగులు, అంబటి రాయుడు 8 బంతుల్లో 19 పరుగులు చేశారు.ఇక రవీంద్ర జడేజా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో చెన్నై జట్టు ఘనవిజయం సాధించింది.

ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు మూడు రోజుల నుండి ఎదురు చూశారు.ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడి, సోమవారం మొదటి ఇన్నింగ్స్ సజావుగా సాగి రెండవ ఇన్నింగ్స్ ఆరంభంలో మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది.తరువాత ఎట్టకేలకు వర్షం ఆగడం, ఓవర్లను కుదించి మ్యాచ్ జరిపించారు.మ్యాచ్ పూర్తయ్యే సరికి మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలు అయింది.దీంతో ఒక ఫైనల్ మ్యాచ్ జరగడానికి మూడు రోజుల సమయం పట్టింది.చెన్నై టైటిల్ గెలవడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
