అనంతపురం మునిసిపాలిటీకి ఈ రోజు ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో చూస్తే గత పది రోజులుగా ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి.మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న విధంగా కాకుండా వ్యక్తుల మధ్య పోటీ అన్న విధంగా జరుగుతుండడం గమనార్హం.
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గానికి జేసీ కుటుంబానికి మధ్య రాజకీయ వైషమ్యాలు ఉన్న విషయం తెలిసిందే.కొన్నాళ్లుగా ఈ వివాదాలు రగులుతున్నాయి కూడా.
ఇక, ఇప్పుడు అనంతపురం మునిసిపాలిటీలో తమ హవా చాటేందుకు ఈ రెండు వర్గాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి వార్డులోనూ టీడీపీ అభ్యర్థుల తరఫున పాదయాత్రలు చేశారు.
అదేవిధంగా ఆయన తనయుడు అస్మిత్ రడ్డి, దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
ఇటీవల వీరు నిర్వహించిన రోడ్ షోలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది రావాలి ప్రభాకర్-కావాలి ప్రభాకర్ అనే ప్లకార్డులు దర్శన మిచ్చాయి.
దీంతో ప్రభాకర్ మురిసిపోయారు.ఇక, తన హవా మళ్లీ ప్రారంభమైందని అంటున్నారు.
దీనికితోడు తన వారినే రంగంలోకి దింపడంతోపాటు ఏకగ్రీవాలు కాకుండా కూడా చూసుకున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ బలమైన పోటీ ఇస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అన్నింటికి మించి ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉండి కూడా కౌన్సెలర్‌గా రంగంలో ఉండడంతో పుర పోరు హోరెత్తుతోంది.

మరోవైపు కేతిరెడ్డి వర్గం కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది.అనంతపురం ఎంపీ కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో కేతిరెడ్డి అన్నీ తానై ఇక్కడ చక్కబెడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.ఇక, స్థానిక బలాబలాలను చూసుకుంటే జేసీ వర్గంపై పోలీసుల దాడులు, కేతిరెడ్డి దూకుడు వంటివి జేసీ వర్గానికి అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
ప్రజల్లోనూ సానుభూతి పెరిగిందని అంటున్నారు.అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్నీ అనంత ప్రజలకు అందించడంలో కేతిరెడ్డి తగు జాగ్రత్తలు తీసుకున్నారు.దీంతో ప్రభుత్వ పథకాల ఎఫెక్ట్ వైసీపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య హోరా హోరీ పోరు తప్పదనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
ఈ నేపథ్యంలో అనంతపురం మునిసిపాలిటీలో టీడీపీ విజయం సాధించే అవకాశం ఉందని ఎక్కువగా వినిపిస్తుండడం కేతిరెడ్డి వర్గానికి ఇబ్బందిగా మారింది.అయితే సంపూర్ణ మెజారిటీ సాధించడంపై జేసీ వర్గంలోనూ గుబులు పట్టుకుంది.
చివరి నిముషం వరకు ప్రజలను తమ వెంట నిలుపుకోగలుగాతామా? అనేది ఇప్పుడు వీరి ముందున్న ప్రశ్న.మరి ఏం జరుగుతుందో చూడాలి.