అవసరాన్ని బట్టి.పరిస్థితులను బట్టి పార్టీలు అభ్యర్థుల స్టానాలు మారుస్తుంటాయి… అవసరమైతే అభ్యర్థులను కూడా మారుస్తాయి.
అలాగే పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా మార్పులు చేస్తుంటాయి.ఇప్పుడు ఏపీలో వైసీపీ కూడా అదే చేస్తుందని అంటున్నారు.
ఏపీలో అన్ని పార్టీలకు కీలకమైన జిల్లా గుంటూరు.ఈ జిల్లాలో ఏకంగా 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
తూర్పుగోదావరిలో 19 స్థానాలు ఉండగా ఈ జిల్లా తర్వాత అత్యధిక అసెంబ్లీ సీట్లు గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి.అలాగే రాష్ట్రంలోనే అత్యధికంగా తూర్పుగోదావరితో సమానంగా మూడు పార్లమెంట్ సీట్లు కూడా గుంటూరులోనే ఉన్నాయి.
అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని…
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో రేపల్లె, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన 15 చోట్ల వైసీపీ విజయం సాధించింది.టీడీపీ కంచుకోట లాంటి స్థానాల్లోనూ వైసీపీ జెండా పాతేసింది.
మూడు పార్లమెంటు సీట్లలో నరసరావుపేట బాపట్లను వైసీపి గెలుచుకుంది.ఇక గుంటూరు పార్లమెంటు సీటును మాత్రం తక్కువ మెజారిటీతో కోల్పోయింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ చేయాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం మరికొన్నిచోట్ల గట్టి అభ్యర్థులను పోటీలో నిలపడం వంటివాటిపై దృష్టిసారించిందని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను అదనపు ఇన్ చార్జిగా నియమించింది.సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి 2024లో పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవచ్చని అంటున్నారు.
అందుకే డొక్కా నియామకం దీనికి స్పష్టమైన సూచనగా భావిస్తున్నారు.ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు.
గతంలో 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తాడికొండ నుంచి ఆయన గెలుపొందారు.ఈ నేపథ్యంలో తాడికొండ నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్ ను పోటీ చేయిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్య నేతల స్థానాలు మార్పు.!
ఇక వైసీపీ ముఖ్యనేతల్లో మంత్రి అంబటి రాంబాబు ఒకరు.జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లా (ప్రస్తుతం పల్నాడు జిల్లా) సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు.ఈసారి ఆయనను కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పోటీ చేయిస్తారని సమాచారం.
ఈ విషయంలో అంబటి అసంతృప్తిగా ఉన్నప్పటికీ అవనిగడ్డకు వెళ్లక తప్పదని అంటున్నారు.గతంలో అంటే 1989లో అంబటి రాంబాబు గుంటూరు జిల్లా రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అలాగే జగన్ వీర విధేయుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా సత్తెనపల్లి నుంచి పోటీ చేయిస్తారని చెబుతున్నారు.ఆర్కే స్థానంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దించుతారని అంటున్నారు.
అందులోనూ చేనేత సామాజికవర్గానికి చెందిన అభ్యర్థే పోటీ చేస్తారని అంటున్నారు.

మంగళగిరిలో ఎవరు.?
ఈ నేపథ్యంలో మంగళగిరి నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగడానికి వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు కమల రేసులో ఉన్నారు.అలాగే ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మరిజగన్ చివరకి ఎవరకి సీటు కేటాయిస్తారో చూడాలి.అలాగే ఈ జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.