జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే జరగకూడదు అని కోరుకున్నారో ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది.ఏపీ అధికార పార్టీ వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వబోము అంటూ పవన్ గత కొంతకాలంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.
దీనిలో భాగంగానే ఏపీలోని విపక్ష పార్టీలన్నిటితో పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కోవాలనే వ్యూహానికి తెర తీశారు.ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతోంది .కానీ పవన్ ఒత్తిడి పెంచుతున్న, బిజెపి మాత్రం టిడిపిని కలుపుకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.ఈ క్రమంలో బీజేపీని వదులుకునైనా టిడిపి తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో పవన్ ఉన్నారు.
అంతేకాదు బిజెపి తమతో కలిసి వచ్చినా, రాకపోయినా వామపక్ష పార్టీలను టిడిపిని కలుపుకుని వెళ్లి ఏపీలో తమ సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో పవన్ తో పాటు, చంద్రబాబు ఉండగా ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కారణంగా పవన్ చంద్రబాబు ఆశలు తీరే అవకాశం కనిపించడం లేదు.

నిన్ననే ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ను కేసీఆర్ భారీగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు , వాము పక్ష పార్టీ కి చెందిన ఆగ్రనేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా వామపక్ష పార్టీలతో దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకునే విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ చర్చించారట.
ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీలు టిఆర్ఎస్ కు మద్దతు పలికాయి.దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళుతున్న క్రమంలో , ఆ పార్టీతో కలిసి నడిచేందుకు వామపక్ష పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి .ఇక కెసిఆర్ ఏపీలోనూ పాగా వేయాలని చూస్తుండడంతో, అక్కడ కూడా వామపక్ష పార్టీల తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.అయితే ఇప్పటి వరకు టిడిపి, జనసేన పార్టీలు వామపక్ష పార్టీలపై ఆశలు పెట్టుకున్నాయి.
తమ నాలుగు పార్టీల బలం తో ఏపీలో ఎన్నికలను ఎదుర్కొంటే సునాయాసంగా వైసిపిని ఓడించవచ్చనే అభిప్రాయంతో ఉన్నాయి.అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కారణంగా వామపక్ష పార్టీలు జనసేన, టిడిపి కూటమికి దగ్గర అయ్యే అవకాశం కనిపించడం లేదు.

జాతీయ స్థాయిలో అవసరాల దృష్ట్యా వామపక్ష పార్టీల అగ్ర నేతలు బిఆర్ఎస్ తో కలిసి వెళ్లేందుకు మొగ్గు చూపిస్తుండడంతో, ఏపీలోనూ ఆ పొత్తు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.ఇదే జరిగితే చంద్రబాబు , పవన్ ఆశలపై కేసీఆర్ నీళ్ళు చిమ్మినట్టే.ఏపీలో ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలనివ్వబోము అంటూ పవన్ చేసిన ప్రకటన ఇప్పుడు కేసీఆర్ కారణంగా తీరేలా కనిపించడం లేదు.







