ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలతో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే.ఈ పరిణామాలు భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకోగా.భారత్ కెనడాలో వీసా జారీ కేంద్రాన్ని మూసివేసింది.
ఇదిలావుండగా.ఖలిస్తాన్ వేర్పాటువాదం మరోసారి తీవ్రరూపు దాల్చే అవకాశాలు వుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఖలిస్తాన్ సానుభూతిపరులను గుర్తించే పనిలో పడింది.భారత్‌లో ఈ ఉద్యమం శాంతించినప్పటికీ పంజాబ్ నుంచి విదేశాలకు వెళ్లిన కొందరు సిక్కులు అక్కడి నుంచి పోరాటం చేస్తున్నారు.
ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా కేంద్రంగా ఖలిస్తాన్ వేర్పాటువాదం బుసలు కొడుతోంది.

ఈ క్రమంలో ఉద్యమం మరింత తీవ్రంగా మారకుండా కేంద్ర ప్రభుత్వం( Central Govt ) చర్యలు తీసుకుంటోంది.దీనికి సంబంధించి భారత్ .ద్విముఖ ప్రణాళికను రూపొందించింది.తొలుత.భారతదేశంలో వాంటెడ్‌గా వుండి, విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులందరి ఆస్తులను గుర్తించాలని దర్యాప్తు సంస్థలను కోరింది.రెండవది భారత మూలాలు వుండి విదేశీ పౌరులుగా వున్న వారికి అందజేసే ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులను రద్దు చేయాలని నిర్ణయించింది.యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్థిరపడిన ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలను గుర్తించాలని వారి ఓసీఐ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఓసీఐ కార్డు ద్వారా వీరంతా వీసా లేకుండా మనదేశానికి రావొచ్చు.ఇప్పుడు ఈ కార్డ్ రద్దు చేస్తే వారు వీసా రహిత ప్రవేశం పొందలేరు.

ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాదులు గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurupatwant Singh Pannu ),హర్దీప్ సింగ్ నిజ్జర్ లకు చెందిన భారత్‌లోని ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జప్తు చేసిన సంగతి తెలిసిందే.ఇదే క్రమంలో యూఎస్, యూకే, కెనడా, యూఏఈ, పాకిస్తాన్ సహా ఇతర దేశాల్లో నివసిస్తున్న రెండు డజన్ల మంది ఖలిస్తాన్ సానుభూతిపరులను గుర్తించింది.వీరితో పాటు ఖలిస్తాన్ ఉద్యమానికి నిధులు, ఇతరత్రా సాయాలు అందించే వారిని కూడా కేంద్రం టార్గెట్ చేసింది.త్వరలోనే వీరందరికి భారత ప్రభుత్వం గట్టి షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.







