ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈటీపీఏ)( Early Progress Trade Agreement ) కోసం జరుగుతున్న చర్చలకు విరామం ఇస్తున్నట్లుగా కెనడియన్ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది.జాతీయ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ ఈ మేరకు కథనాన్ని ప్రచురించింది.
ఈ సంస్థ ప్రతినిథి అడిగిన ప్రశ్నకు ఒట్టావాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ స్పందిస్తూ.కెనడియన్ ప్రభుత్వం వైపు నుంచి ఈ అగ్రిమెంట్‌పై చర్చలకు విరామం వచ్చిందన్నారు.
విరామం ఎత్తివేసే వరకు తాము వేచి వుంటామని సంజయ్ కుమార్ చెప్పారు.
ఇదే సమయంలో విరామం ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో కెనడా ఎలాంటి కారణం చూపలేదు.అయితే ఇది తాత్కాలికమేనని భారత ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్( Piyush Goyal )తో కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగకపోవడంతో.
ఈ ఏడాది ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపించడం లేదు.

కాగా.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ రావడానికి ముందే విరామం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.చర్చలు ప్రస్తుతానికి ఆగిపోయాయని తొలుత కెనడియన్ ప్రెస్ నివేదించింది.
ఈ ఏడాది మార్చిలో ద్వైపాక్షిక పర్యటన కోసం ఎన్జీ భారతదేశాన్ని సందర్శించిన తర్వాత సమగ్ర ఆర్ధిక ఒప్పందం (సీఈపీఏ)కు పూర్వం వున్న ఈటీపీఏపై చర్చలు ప్రారంభమయ్యాయి.ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య పది రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి.

మరోవైపు.భారత్, కెనడాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గతేడాది దాదాపు 11.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.2021తో పోలిస్తే ఇది 56 శాతం వృద్ధి.అటు సేవా వాణిజ్యం గతేడాది 8.9 బిలియన్లకు చేరుకుంది.అయితే కెనడియన్ వాణిజ్య మంత్రి ఈ ఏడాది అక్టోబర్‌లో భారతదేశాన్ని సందర్శించిన తర్వాత చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.







