వచ్చే ఏడాది జరగనున్న కెనడియన్ ఫెడరల్ ఎన్నికలకు ముందు ప్రధాని జస్టిన్ ట్రూడో( Prime Minister Justin Trudeau ) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆయన పాలన, సమర్ధతపై సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్నారు.
కొద్దిరోజుల క్రితం భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూడెమొక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) తన మద్ధతు ఉపసంహరించుకోవడంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది.ట్రూడో, లిబరల్ పార్టీ పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదపడంతో ప్రభుత్వం గట్టెక్కింది.
లేని పక్షంలో ట్రూడో సర్కార్ కుప్పకూలేది.
ఈ సంక్షోభం నుంచి ఊరట లభించి రోజులు గడవకముందే ట్రూడోకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేయాలని ఏకంగా 24 మంది లిబరల్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు.అధికార పక్షానికి చెందిన కీలక సభ్యులు రహస్యంగా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ ఏడాది జరిగిన పలు ఎన్నికల్లో లిబరల్ పార్టీకి( Liberal Party in the elections ) దారుణమైన ఫలితాలు రావడానికి జస్టిన్ ట్రూడో వైఖరే కారణమని అసమ్మతి నేతలు అభిప్రాయపడ్డారు.

ట్రూడో తక్షణం పదవికి రాజీనామా చేయాలని 24 మంది ఎంపీలు సంతకాలు చేయడంతో పాటు అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్ విధించడం హాట్ టాపిక్‌గా మారింది.ఈ పరిణామాల నేపథ్యంలో జస్టిన్ ట్రూడో మీడియాతో మాట్లాడుతూ.తాము బలంగా ఉన్నామని వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తానే పార్టీకి నాయకత్వం వహిస్తానని స్పష్టం చేశారు.

కాగా.ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును అనుమానితుల జాబితాలో చేర్చడంతో భారత్ మండిపడింది.ట్రూడో చర్యల కారణంగా ఇరుదేశాల సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది.
కెనడా ప్రజలు సైతం భారత్‌తో ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదని చెబుతున్నారు.ఓపీనియన్ పోల్స్‌లో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.
ఇలాంటి పరిస్ధితుల్లో ట్రూడోకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ రేగడంతో కెనడా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.